టీడీపీకి ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుందంటూ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. టీడీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ లు పార్టీకి వ్యతిరేకమైన స్టాండ్ తీసుకున్నారు. టీడీపీతో విభేదించి వైసీపీకి తమ మద్దతు తెలిపారు. డైరెక్ట్ గా పార్టీ కండువా కప్పుకుంటే అనర్హత వేటు పడుతుందనే ఉద్దేశంతో వైసీపీకి మద్దతు తెలిపారు. ఈ నలుగురు ఎమ్మెల్యేల టీడీపీకి దూరం జరగడంతో ప్రస్తుతం ఆ పార్టీ బలం 19కి పడిపోయింది. మరో ఇద్దరు సభ్యులను పార్టీలో చేర్చుకుంటే టీడీపీకి ప్రతిపక్ష హోదా దక్కదని వైసీపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ ప్లాన్
ఈ నేపథ్యంలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలకు వైసీపీ గాలం వేసింది. ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావుల కోసం వైసీపీ పెద్దలు తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. ఓ దశలో వైసీపీలో వీరి చేరికకు ముహూర్తం ఖరారు అయింది. ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్ లకు నారా లోకేష్ ఇచ్చిన హమీతో వారు పార్టీ మార్పు నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇక గంటా సంగతి ఆయనకే తెలియాలి. మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్ అడ్డుపడటంతో పాటు వైసీపీ శ్రేణుల నిరసనలతో గంటా వైసీపీలో చేరడం వాయిదా పడింది.
పార్టీ మార్పు కారణాలు
అమరావతి నుంచి రాజధానిని తరలించాలానే ఉద్దేశంతో జగన్ సర్కార్ మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇదే సమయంలో విపక్షాలు కూడా టీడీపీతో గొంతు కలపడంతో ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు రాజధానికి అనుకూలమని తెలపాలంటే వారిని వైసీపీలోకి చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్ధించేలా ఆ ప్రాంతపు టీడీపీ ఎమ్మెల్యేలను ఆహ్వనిస్తున్నారు. ఈ కోవలోనే వాసుపల్లి గణేష్ పార్టీ మారినట్లు తెలుస్తోంది.
విశాఖలో టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వాసుపల్లి గణేష్ తో పాటు గంటా శ్రీనివాస రావు, వెలగపూడి రామకృష్ణ బాబు, గణబాబులు గత ఎన్నికలలో టీడీపీ నుంచి గెలుపొందారు. గణబాబును కూడా రాజధాని నిర్ణయానికి మద్దతుగా నిర్ణయాన్ని తీసుకోవాలని వైసీపీ నాయకులు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని తెలుస్తోంది. వెలగపూడి రామకృష్ణ కోసం అదే సామాజిక వర్గానికి చెందిన ఓ మంత్రి రంగంలోకి దిగినట్టు వార్తలు వినబడుతున్నాయి. కానీ వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో వైసీపీ వేరే ఎమ్మెల్యేలపై ద్రుష్టి సారించినట్లు తెలుస్తోంది.
నెక్స్ట్ ఎవరు?
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అశోక్ బెందాళం వైసీపీలోకి చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అశోక్ రాకతో శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి అచ్చెన్నాయుడు తప్ప ఎవరూ ఉండరని వైసీపీ ఆలోచనగా ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో బాటు గోదావరి జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలను కూడా వైసీపీ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. తూర్పు గోదావరి నుంచి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర రావుల జోలికి పోనీ వైసీపీ రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని కుటుంబంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
ఆదిరెడ్డి భవాని మామగారు గతంలో వైసీపీలో పని చేసిన సంగతి తెలిసిందే. ఆ పరిచయంతో వెస్ట్ భవానిని పార్టీ మారమని వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. వెస్ట్ గోదావరి నుంచి నిమ్మల రామానాయుడు, శివరామరాజులు టీడీపీని వీడే ప్రసక్తే లేదని నిర్దారించుకున్న వైసీపీ ఆ ప్రయత్నాలకు స్వస్తి పలికినట్లు సమాచారం. ఒకవేళ వైసీపీ చేసిన ప్లాన్ వర్క్ అయితే అశోక్ బెందాళం, ఆదిరెడ్డి భవానిలు త్వరలోనే పార్టీ మార్పు ఖాయమని వార్తలు వినబడుతున్నాయి.
దీంతో టీడీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని వైసీపీ ఆలోచనగా ఉంది. కానీ రాజకీయ నిపుణుల చెబుతున్న మేరకు వైసీపీ ప్రయత్నాలు ఫలించేలా లేవు. రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ వ్యతిరేక స్టాండ్ తీసుకుంటే స్పీకర్ కు ఫిర్యాదు చేయాలని టీడీపీ సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ టీడీపీ వీరిని సస్పెండ్ చేస్తే ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే టీడీపీ కూడా రెబల్ ఎమ్మెల్యేల విషయంలో చూసి చూడనట్లు ఉంటుందని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగవలసిందే!!











