పల్నాడులో పురుడు పురుడుపోసుకుంటున్న ఫ్యాక్షన్..!!
గురజాల నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలు తిరిగి పురుడుపోసుకుంటున్నాయి. నియోజకవర్గంలోని దాచేపల్లిలో తలెత్తిన ఫ్లెక్సీ రాజకీయం ఫ్యాన్ పార్టీ నేతల మధ్య గ్యాప్ ను ఒక్కసారిగా బయటపెట్టాయి. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వర్గీయుల మధ్య రేకెత్తిన ఫ్లెక్సీ వివాదం శ్రేణులను బాహాబాహీకి దిగేలా చేశాయి. మంత్రి పెద్దిరెడ్డికి జంగా వర్గం స్వాగత ఫ్లెక్సి ని గామాలపాడు పోయే రహదారి పక్కన ఏర్పాటు చేశారు. అదే ఫ్లెక్సీపై సీఎం జగన్ కు ఎమ్మెల్యే కాసు వర్గం బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఫ్లెక్సి ఏర్పాటు చేయాలని ప్రయత్నించింది. దీంతో తలెత్తిన వివాదం ఫ్లెక్సీలను చించేసుకుని కోట్లాటకు దారితీసింది. ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఎమ్మెల్సీ జంగా స్వగ్రామమైన గామాలపాడులో సచివాలయం ఓపెనింగ్ సందర్భంగా ఆయన వర్గీయులు ఫ్లెక్సిని ముందుగా ఏర్పాటు చేశారు. జగన్ పుట్టిన రోజు సందర్బంగా అదే స్థానంలో శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సిని ఏర్పాటు చేయాలని సమాయక్తం మయ్యారు కాసు వర్గీయులు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం రేగింది.











