అతనో క్యాబ్ డ్రైవర్. పేరు శ్రీకాంత్. డ్రైవింగ్ నే నమ్ముకొని కుటుంబాన్ని పోశిస్తున్నాడు. ఉబర్ లో చేరి, చక్కగా కారు నడుపుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. రేటింగ్ కూడా బాగానే ఉంది. శ్రీకాంత్ తిరుపతి వేంకటేశ్వరుడికి భక్తుడు. శ్రీవారికి తలనీలాలు సమర్పించుకోవాలని, ఈ మధ్యనే మొక్కు చెల్లించుకున్నాడు. తిరుపతిలో గుండు కొట్టించుకోవడం కారణంగా శ్రీకాంత్ ఉద్యోగం కోల్పోయాడు. గుండుకు, ఉద్యోగానికి సంబంధం ఏంటంటారా…?
తిరుపతి నుంచి వచ్చిన శ్రీకాంత్ ఉద్యోగంలో చేరాడు. అయితే ఉబర్ డ్రైవర్లు లాగిన్ సమయంలో, ప్రతి ట్రిప్పు తర్వాత తమ సెల్ఫీని అప్‌లోడ్ చేయాలి. తలపై వెంట్రుకలు ఉన్న శ్రీకాంత్ ఫొటో ఉబర్ సిస్టంలో అంతకుముందే రిజిస్టర్ అయ్యింది. గుండుతో ఉన్న ఫొటో అప్‌లోడ్ చేస్తే అంగీకరించలేదు. పదే పదే లాగిన్ కోసం ప్రయత్నించడంతో ఐడీ కూడా బ్లాక్ అయింది. చివరకు ఉబర్ ఆఫీస్ కు వెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. ఒకటి కాదు, రెండు కాదు.. 34 సార్లు ఉబర్ ఆఫీస్ చుట్టు చక్కర్లు కొట్టాడు శ్రీకాంత్. విషయం తెలుసుకున్న సదరు డ్రైవర్లు ‘గుండు ఎంత పనిచేసింది’ అంటూ జాలీ చూపుతున్నారు. శ్రీకాంత్ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో ఆ తిరుపతి వెంకటేశ్వరుడికే తెలియాలి.
Also Read:జుట్టు రాలే సమస్యలను ఉల్లి తగ్గిస్తుందా : అసలు సీక్రెట్ ఇదే!