అక్కినేని నాగార్జున సరైన హిట్ కొట్టి చాలా కాలం అయిపోతోంది. ఈ సారి ఎలాగైనా మంచి సక్సెస్ సాధించాలనే పట్టుదలతో ‘వైల్డ్ డాగ్’ అనే మూవీతో నేడే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హైద్రాబాద్ లో వరుస బాంబ్ పేలుళ్ళ నేపథ్యంలో వాస్తవ సంఘటనలతో సాగే ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు థ్రిల్ చేస్తుంది? కొత్త దర్శకుడు అహిషోర్ సోల్మన్ రూపొందించిన ఈ సినిమాతో నాగ్ సక్సెస్ సాధిస్తాడా లేదా అనే విషయాలు రివ్యూ లో తెలుసుకుందాం…
కథేంటి:
2007 లో హైద్రాబాద్ లో గోకుల్ చాట్ వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్ తర్వాత వరుసగా పూణే, హైద్రాబాద్ లో వరుస బాంబ్ బ్లాస్టులు జరుగడం దగ్గర నుంచి కథ టేకాఫ్ తీసుకుంటుంది. అలాంటి భయంకరమైన అటాక్స్ తర్వాత అసలు సూత్రధారిని పట్టుకోడానికి అధికారులు కేసును యన్.ఐ . ఏ టీమ్ కు అప్పగిస్తారు. యన్.ఐ.ఎ లో రూత్ లెస్ ఆఫీసరైన విజయ్ వర్మ (నాగార్జున) చేతుల్లోకి వెళుతుంది కేస్. తన టీమ్ తో విజయ్ వర్మ ఆ టెర్రిరిస్టుల్ని ఎలా ట్రేస్ చేస్తాడు? దానికోసం ఎలాంటి రిస్క్ చేశాడు? చివరికి అసలు సూత్రధారిని టీమ్ ఎలా పట్టుకున్నారు అన్నదే మిగతా కథ.
ఎలా తీశారు? ఎలా చేశారు?
వాస్తవ సంఘటనలతో రియలిస్టిక్ గా సినిమా తీయాలనుకున్నప్పుడు .. దానికి తగ్గ డ్రామాను, ఎమోషన్స్ ను బాగా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఆ రెండూ లైటర్ వేలోనే ఉండడంతో కథనం చాలా ఫ్లాట్ గా మారిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే.. ప్రతీసీన్ ప్రేక్షకుడికి ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. కాకపోతే.. యాక్షన్ సీన్స్ వల్ల కొంత రిలీఫ్ కలుగుతుంది. అలాగే.. పూణే బాంబ్ బ్లాస్ట్ సూత్రధారి ఖలీద్ ను ట్రేస్ చేయడానికి విజయ్ వర్మ టీమ్ సాగించిన ఆపరేషన్ .. ఇంట్రవెల్ దగ్గర మంచి మలుపు తీసుకోవడంతో.. సెకండాఫ్ మీద మరింత ఆసక్తి పెరుగుతుంది. దానికి తోడు విజయ్ వర్మ సస్పెండ్ అవడం వల్ల .. ఖలీద్ ను అతడు ఎలా పట్టుకుంటాడు అనే విషయంలో ఆత్రుత పెరుగుతుంది.
అయితే సెకండాఫ్ నుంచి ఖలీద్ నేపాల్ లో ఉన్నట్టు తెలియడంతో నాగ్ టీమ్ సాగించే సీక్రెట్ వైల్డ్ డాగ్ కోవర్ట్ ఆపరేషన్ .. ఏమంత కొత్తగా అనిపించదు. ఇక్కడే దర్శకుడు స్ర్కీన్ ప్లే ను మరింత పగడ్బందీగా రాసుకుని ఉంటే బాగుండును అనిపిస్తుంది. అలాగే ఇన్వెస్టిగేటింగ్ పాయింట్స్ కూడా ఏమంత ఇంట్రెస్టింగ్ గా అనిపించవు. ఇందులో కొన్ని సన్నివేశాలు గతంలో ఏదో సినిమాలో చూసినట్టే అనిపిస్తుంది. ఇక దర్శకుడు కథగా బాగానే చెప్పినా.. కథనం విషయంలో ఏ విధంగానూ ప్రేక్షకుల్ని థ్రిల్ చేయలేకపోవడం ఈ సినిమాకున్న అతి పెద్ద మైనస్ పాయింట్ .
టోటల్ గా వైల్డ్ డాగ్ సినిమాలో మెప్పించే అంశమేదైనా ఉంది అంటే.. ప్రీ క్లైమాక్సే అని చెప్పాలి. టెర్రరిస్ట్ ఖలీద్ ను నేపాల్ బోర్డర్ క్రాస్ చేయించి.. ఇండియా తీసుకొచ్చే సన్నివేశం మెప్పిస్తుంది. ఆ సీన్ ప్రేక్షకులకి మంచి థ్రిల్ ఇస్తుంది.
విజయ్ వర్మ గా నాగార్జున . వన్ మేన్ షో చేసినప్పటికీ… ఆయన ఆన్ స్ర్కీన్ ప్రెజెన్స్ ఏమంత బాగా లేదని చెప్పాలి. ఆయన ఫేస్ లో ముసలితనం క్లియర్ గా కనిపించడం కాస్తంత ఇబ్బందిగా అనిపిస్తుంది. పెర్ఫార్మెన్స్ పరంగానూ, యాక్షన్ సీన్స్ విషయంలోనూ నాగ్ మెప్పిస్తారు. అలాగే.. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ ఆలి రెజా మంచి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడు. ఇంకా అతుల్ కులకర్ణి, అనీష్ కురువిల్లా పాత్రలు కూడా మెప్పిస్తాయి. ఇక గెస్ట్ అపీరెన్స్ ఇచ్చిన దియా మీర్జా, సయామీ ఖేర్ పాత్రలు ఓకే అనిపిస్తాయి.
ఇక సినిమాకి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతం అనిపిస్తుంది. అలాగే.. సినిమాటో గ్రఫీ , నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. టోటల్ గా వైల్డ్ డాగ్ సినిమా పర్వాలేదనిపిస్తుంది. అయితే కథాకథనాల విషయంలో మరింత శ్రద్ధ పెట్టి ఉంటే.. నాగ్ కు మరో లెవెల్ సినిమా అయి ఉండేది.
హైలైట్స్ : యాక్షన్ సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్
నటీనటులు : నాగార్జున, దియా మీర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, ఆలీ రెజా, అనీష్ కురువిల్లా తదితరులు
సంగీతం : యస్.యస్. తమన్
నిర్మాణం : మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాత : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
దర్శకత్వం : అహిషోర్ సోల్మన్
ఒక్కమాటలో : నాట్ సో వైల్డ్..
విడుదల తేదీ : ఏప్రిల్ 2, 2021
రేటింగ్ : 2. 25 / 5
-ఆర్కే











