రఘురామక్రిష్ణ రాజును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శత్రువుగా చూడడం ప్రారంభించి చాన్నాళ్లు గడుస్తున్నాయి. ‘జగన్ నా ప్రియమైన నాయకుడు’ అనే మాటతో ప్రారంభిస్తూ రాజు.. వైసీపీ పరువు ఎంతగా బజార్లో పెట్టాలో అంతగానూ ఆ పని చేసేస్తున్నాడు. ఆయన మాటలకు ప్రజల్లో ఎలాంటి క్రెడిబిలిటీ దక్కకుండా ఉండేందుకు, జగన్ బ్యాచ్ తమంత తాము శతవిధాల ప్రయత్నం చేస్తోంది. ఈ తరుణంలో ఆయన జగన్ కాళ్లు పట్టుకుని టికెట్ తెచ్చుకున్నారంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యలు మరోసారి.. రఘురామ రాజును రెచ్చగొట్టాయి.
ఈ మాటల నేపథ్యంలో ప్రధానంగా కలుగుతున్న సందేహం ఏంటంటే.. ఎవరు పడితే వాళ్లొచ్చి కాళ్లు పట్టుకుంటే చాలు.. ఎంపీ టికెట్ ఇచ్చేసే స్థితిలో అప్పట్లో జగన్ ఉన్నారా? కాళ్లు పట్టుకున్న ప్రతి ఒక్కరికీ టికెట్ ఇవ్వాలని ఆన ఎజెండా పెట్టుకున్నారా? అనేది సందేహం. రాజుకు టికెట్ దక్కిందంటే కారణం కాళ్లు పట్టుకోడం కాదు. ఇంకా అనేకం ఉన్నాయి.
రఘురామక్రిష్ణ రాజు ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి. ఆ బలమే ఆయనకు టికెట్ ఇప్పించింది. ఎన్నికల సమయంలో- ఆయన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు అందరికీ ఆర్థిక వనరుల పరంగా ఇతోధికంగా సాయం చేశారు. ఆరకంగా- జగన్ తనకు ఎంపీ టికెట్ ఇచ్చినందుకు పార్టీకి ప్రత్యుపకారం చేశారు. – ఇవన్నీ జనం మాట్లాడుకుంటున్న సంగతులు.
‘టికెట్ ఎలా వచ్చింది’ అనేది టాపిక్ అనుకుంటే.. దానికి రాజు గతంలో చెప్పిన కథ వేరే ఉంది. తనను విజయసాయి మరికొందరు నాయకులు వారంత వారుగా సంప్రదించారని, తాను టికెట్ కోసం గాని, పార్టీలో చేరే విషయమై గాని ఒక్కసారి కూడా జగన్ ఇంటికి వెళ్లలేదని.. ఆయన పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో మాత్రమే జగన్‌తో నా తొలిభేటీ జరిగిందని.. ఆ తర్వాత పార్టీలోకి వెళ్లానని రాజు గతంలో ప్రకటించారు.
ఆ మాటల ప్రకారం.. లాంజ్‌లోనే తొలిసారిగా టికెట్‌కు సంబంధించిన డీల్ కుదిరింది. ఈ విషయం రఘురామక్రిష్ణ రాజు బయటపెట్టిన తరువాత.. ఆయన్ని పార్టీ నేతలు ఎన్ని రకాలుగా తిడుతున్నప్పటికీ.. ఆ ఒక్క విషయంలో ఎవ్వరూ నోరు మెదపడం లేదు. ఆయన కూడా ఆ పాయింట్ వదిలేసి.. ఇతర అంశాలు ఎత్తుకున్నారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే.. ప్రధాన ప్రతిపక్షం స్పందించడానికంటె ముందుగా, అంతకంటె సూటిగా ఆయన విమర్శలు సంధిస్తున్నారు.
పార్టీ తరఫున ఎంపీగా బరిలో ఉండే అభ్యర్థి నుంచి ఆ పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఆర్థికంగా సాయం పొందడం సాంప్రదాయంగా వస్తూనే ఉన్న సంగతి. అయితే.. వైకాపా అధినాయకత్వంతో చిన్న పొరపొచ్చాలు వచ్చిన తర్వాత.. ఇంగ్లిషు మీడియం వంటి కొన్ని అంశాల్లో తాను విభేదించిన తరువాత.. తన సాయం పొందిన వారంతా తన మీద విమర్శలు చేయడాన్ని రఘురామక్రిష్ణ రాజు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఆయన వారి మీద ఎడాపెడా విమర్శలు చేస్తున్నారు. కాళ్లు పట్టుకుని టికెట్ తెచ్చుకున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అనగానే.. టికెట్ విషయంలో ఎవరు ఎవరిని ప్రాధేయపడ్డారో నేను గతంలోనే చెప్పా అంటూ ఆర్ఆర్ఆర్ మళ్లీ షాక్ ఇచ్చారు.
ఆయనను నిజంగానే ఇరుకున పెట్టాలనుకుంటే గనుక వైఎస్సార్సీపీ నాయకులు ఆ విషయంలో నోరు తెరిస్తే బాగుటుంది. లాంజ్‌లో భేటీ జరగనేలేదని తేల్చగలిగినా బాగానే ఉంటుంది. విషయం తేల్చేయకుండా.. మీడియా అడిగినప్పుడెల్లా పసలేని విమర్శలు చేసుకుంటూ ఉంటే.. ఏం ఒరుగుతుంది. ఆయనను గిల్లినట్టుగా పార్టీ నాయకులు మాట్లాడడం, ఆయన ఎడాపెడా రంకెలు వేయడం తప్ప.. ఈ పరిణామాల వల్ల మరో ప్రయోజనం ఉండదు.










