(నెల్లూరు నుంచి లియోన్యూస్ ప్రత్యేక ప్రతినిధి)
కరోనా సోకిందా. ఆసుపత్రిలో అడ్మిషన్ కావాలా? పర్లేదు! మీకు మంత్రి తెలుసా.. కలెక్టర్ తెలుసా.. తెలియదా..! అయితే మీ చావు మీరు చావండి. మీకు ఆసుపత్రిలో అడ్మిషన్ దొరకదు అంతే. ఒకవేళ దొరికినా వైద్యం అందదు అంతే. నమ్మకం లేదా.. అయితే చదవండి.
అతని పేరు రమేష్ కుమార్. సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం జెడ్పీ హై స్కూలు ప్రధానోపాధ్యాయుడు. కరోనా సోకండంతో ఈనెల 8వ తేది జీజీహెచ్‌కు వెళ్ళాడు. గంట సేపు ప్రాధేయపడ్డాడు. అడ్మిషన్ దొరకలేదు. ప్రాణాలు కాపాడుకోవాలన్న ఆశతో అయ్యా దయచేసి నన్ను కాపాడండి అని వేడుకొంటూ సెల్ఫీ వీడియో తీసి కలెక్టర్, ఎమ్మెల్యేలకు పోస్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చంద్రబాబు దీనిపై ట్వీట్ చేశారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి జీజీహెచ్‌కు ఫోన్ చేసి విరుచుకుపడటంతో ఇతనికి అడ్మిషన్ అయితే దొరికింది కాని ప్రాణాలు మాత్రం నిలుపుకోలేకపోయాడు. 12వ తేది మరణించాడు.
పది రోజుల క్రితం నెల్లూరుకు చెందిన ఇద్దరు జర్నలిస్టులకు కరోనా వచ్చింది. జీజీహెచ్‌లో అడ్మిట్ అయ్యారు. మరుసటి రోజు జర్నలిస్ట్ గ్రూప్‌లో వీరి సెల్ఫీ విడీయో ప్రత్యక్షమయ్యింది. మేము ఆసుపత్రిలో చేరి 24 గంటలు అవుతున్నా ఇప్పటి వరకు మమ్మల్ని పలుకరించిన వారు లేరు.. మీరైనా కాపాడండి అని తోటి జర్నలిస్టులకు మెసేజ్ పెట్టారు. జర్నలిస్ట్ సంఘ నాయులు వెంటనే రాష్ట్ర సంఘానికి చెప్పారు. వారు ఆరోగ్యశాఖ మంత్రికి చెప్పారు. ఆయన పీఏ జీజీహెచ్ సూపరిండెంట్, జాయింట్ కలెక్టర్లతో మాట్లడారు. ఆ తరువాత డాక్టర్లు వీరి మెహం చూశారు. అయినా ఏం లాభం. మరుసటి రోజే ఇద్దరు జర్నలిస్ట్‌లలో ఒకరు చనిపోయారు. ఇంకొకరు బతుకు జీవుడా అంటూ నారాయణ ఆసుపత్రికి పారిపోయాడు.
ఈ రెండు ఉదాహరణలు చూసిన తరువాత కూడా నెల్లూరు జీజీహెచ్‌లో సాదారణ కరోనా రోగికి బెడ్లు దొరుకుతాయని, ఒకవేళ బెడ్లు దొరికినా చికిత్స అందుతుందని నమ్ముతున్నారా..!?
కలెక్టర్లు…మంత్రులతో మట్లాడగిలిన వారి పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. జీజీహెచ్‌కు వెళితే బెడ్లు లేవంటారు. ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రులకు వెళ్లమంటున్నారు. అక్కడికి వెళితే వాళ్లు బెడ్లు లేవంటున్నారు. ఇలా అక్కడికి ఇక్కడికి తిరిగే మార్గంలోనే చాలా మంది చనిపోతున్నారు. నెల్లూరులోని అపోలో, సింహపురి ఆసుపత్రులు కోవిడ్ ఆసుపత్రులుగా ప్రకటించారు. చట్టప్రకారం వాటిలో ఉచితంగా కరోనా వైద్యం చేయాలి. కాని చేయించే వారు ఎవరు? ఈ రెండూ అధికార వైసీపీ నాయకులకు చెందినవే. వీటికి రోగులను రెఫర్ చేసే దమ్ము అధికారులకు ఎక్కడిది? మీరే వెళ్లి ట్రై సుకోండి అని రోగులకు ఉచిత సలహా ఇస్తున్నారు. వారు వెళితే చేర్చుకుంటారా..! రోజుకు బెడ్డు చార్జీ కింద 25వేల రూపాయలు ఇచ్చే వారికి మాత్రమే ఆ రెండు ఆసుపత్రుల్లో అడ్మిషన్లు దొరుకుతున్నాయి. టీడీపీకి చెందిన మాజీ మంత్రి నారాయణను మాత్రం పిండేస్తున్నారు. కరోనా పుణ్యమా అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నారాయణ ఆసుపత్రిపై ఫోకస్ పెంచారనే ప్రచారం ఉంది. ఈ ఆసుపత్రిలో సాదారణ ఓపీలు చూసి ఆరు నెలలు అవుతోంది. అంతా కరోనా రోగులకే కేటాయించారు. ఈ ఆసుపత్రి తరహాలో కరోనా సేవలు అందించాల్సిన అపోలో, సింహపురి ఆసుపత్రులను మాత్రం రోగులను దోపిడీ చేసుకోమని వదిలేశారు.
అసలు కరోనా వైద్యంలో కీలక పాత్ర పోషించాల్సిన జీజీహెచ్‌ను జిల్లా మంత్రులు గాలికి వదిలేశారు. కరోనా ఆరంభంలో హడావిడి చేశారు కాని ఆ తరువాత ఆసుపత్రి మొహం చూడటం మానేశారు. ఇక్కడ వైద్యం ఎంత దుర్మార్గంగా ఉందంటే… 20 రోజుల క్రితం ఒక కరోనా రోగి వాష్ రూంకు వెళ్లి అక్కడిక్కడే పడి చనిపోతే మరుసటి రోజుకు గాని ఆ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు కనీసం గుర్తించలేదు. అది కూడా పారిశుద్ధ్య కార్మికులు బాత్రూం కడగడానికి వెళ్లినప్పుడు గమనించి, చెబితే తెలుసుకున్నారు. మొబైల్ ఆక్సిజన్ సిలెండర్లు లేక క్యాజువాలిటీ నుంచి ఐసీయుకు తరలించే లోపే రోగులు చనిపోతున్నా వాటిని సమకూర్చే విషయంలో మంత్రులు చొరవ చూపలేదు. పక్క జిల్లాకు చెందిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి పిపీఈ కిట్లు ధరించి రోగులను పరామర్శించి, ధైర్యం చెప్తోంటే జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఇటీవలి కాలంలో జీజీహెచ్ లోకి అడుగు పెట్టలేదు. రోగులను పలకరించిన పాపాన పోలేదు.
జీజీహెచ్‌లో కరోనా వైద్యం దారుణంగా తయారయ్యిందని పత్రికలు, మీడియా ఛానెళ్లు ఘోషించగా… ఘోషించగా…! మొన్నటికి మొన్న ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని నెల్లూరుకు వచ్చి అధికారులతో మాట్లడి వెళ్లారు. ఆసుపత్రికి వెళ్ళిన 30 నిమిషాల్లో అడ్మిషన్ చేసుకునేలా చర్యలు తీసుకొంటున్నామని మీడియాతో శెలవిచ్చారు. మంత్రి ఆళ్ళ నాని వచ్చి వెళ్ళిన తరువాత జీజీహెచ్‌లో మార్పు జరగలేదు. కాని… మంత్రి అనిల్‌కు ప్రత్యర్థిని నష్టపరిచేందుకు మరో అవకాశం దొరికింది. ఆయన 14వ తేది నారాయణ ఆసుపత్రిలో సమావేశం పెట్టి నారాయణ ఆసుపత్రి… యాజమాన్యం కరోనా సమయంలో చాలా బాగా సహకరిస్తోంది. ఈ ఆసుపత్రి పరిధిలో మరో 1000 బెడ్లు కరోనా రోగులకు సిద్దం చేయండి అని ఆదేశించారు. అప్పుడు కూడా అపోలో, సింహపురి కూడా కొవిడ్ ఆసుపత్రులే అని ఆయన మరచిపోయారు. నారాయణ బాగా సహకరిస్తుందన్నప్పుడు.. అపోలో, సింహపురి ఆస్పత్రుల గురించి ఎందుకు ప్రస్తావించలేదో, అవి సహకరించకపోతే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో మంత్రికే తెలియాలి?
కరోనా రోగాన్ని రాజకీయంగా వాడుకొంటున్న నేతలున్న నెల్లూరు జిల్లాలో సగటు మనిషికి నాణ్యమైన కరోనా వైద్యం అందుతుందని ఆశించగలమా..!!? ప‌్రజలే ఆలోచించాలి.