మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కథానాయకులుగా కొరటాల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘ఆచార్య’ సినిమా రఎలీజ్ కు సిద్ధంగా ఉంది.చిరంజీవి – చరణ్ ఇద్దరూ కూడా ఈ సినిమాలో నక్సలైట్స్ గా కనిపించనున్నారు. దేవాలయ భూముల ఆక్రమణకు పాల్పడిన కొంతమంది అవినీతి పరుల ఆటకట్టించే దిశగా ఈ కథ నడుస్తుందని సమాచారం.ఈ మూవీలో చిరు సరసన కాజల్ అలరించనుండగా, చరణ్ కి జోడీగా పూజ హెగ్డే అందాల సందడి చేయనుంది. ఈ నెల 29న విడుదలవుతున్న ఈ సినిమాకి రెజీనా ఐటమ్ సాంగ్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నట్లు సమాచారం.కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి సురేఖ సమర్పణలో మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చగా..మూవీకి సంబంధించి ఇంతవరకూ వదిలిన పాటలు, ఇతర అప్ డేట్లు అంచనాలు పెంచుతూ వెళ్లాయి. తాజాగా వచ్చిన ట్రైలర్ కి కూడా రెస్పాన్స్ వచ్చింది.
చిరు – కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఆచార్య చిత్రం కోసం మెగా అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.ఈ నెల 29న ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లలో స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో ఇవాళ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు నిర్ణయించింది. హైదరాబాద్ – యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నా ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి అవుతున్నాయి.సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది.
ఇక ఈ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా వస్తారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం పవన్ పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా కార్యక్రమంలో బిజీగా ఉండడం వల్ల ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారని తాజా సమాచారం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్ అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. వారికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ నేపధ్యంలో ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ స్థానంలో ముఖ్య అతిథిగా దర్శక దిగ్గజం రాజమౌళి హాజరుకానున్నారు. అయితే పవన్ కల్యాణ్ రావట్లేదనే విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు. పవన్ ఆచార్య ఈవెంట్‌కు వచ్చి ఉంటే..ఆ కిక్ వేరేలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.