దమ్ముంటే నన్ను పట్టుకోండి చూద్దాం అంటూ పోలీసులకే ఛాలెంజ్ విసిరి అడ్డంగా దొరికిపోయాడు ఓ ఘరానా దొంగ.ఖరీదైన కార్లను కొత్తేసే ఒక దొంగ విసిరిన సవాల్ ను ప్రేస్టేజ్ గా తీసుకున్న పోలీసులు వ్యయప్రయాసలు ఓడ్చి ఎట్టకేలకు ఆ దొంగను చాకచక్యంగా పట్టుకున్నారు.
రాజస్థాన్ లోని జైపూర్ కి చెందిన సత్యేంద్ర సింగ్ షెకావత్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఖరీదైన కార్లను కాజేస్తున్నాడు. వీఐపీలు, సెలబ్రిటీల కార్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నాడు.షెకావత్ ఇప్పటివరకు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో దాదాపు 60 కార్ల వరకు చోరీ చేశాడు.తాజాగా 2021లో హైదరాబాదులోని బంజారాహిల్స్ లో కన్నడ సినీ ప్రొడ్యూసర్ వి.మంజునాథ్ కారు చోరీకి గురి కాగా, బంజారా హిల్స్ పోలీసులు ఈ ఘటణపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.పోలీసుల దర్యాప్తులో సత్యేంద్ర సింగ్ షెకావత్ ఈ చోరీకి పాల్పడినట్టు గుర్తించారు.
అయితే అతడిని పట్టుకోవడంలో పోలీసులకు పలు చిక్కులు ఎదురయ్యాయి. షెకావత్ స్వస్థలం రాజస్థాన్ లోని జైపూర్ అని గుర్తించిణ పోలీసులు అక్కడకి వెళ్ళేసరికే అతడు అక్కడి నుంచి ఉడాయించాడు.అంతటితో ఆగకుండా “నమస్తే సార్… మీరు జైపూర్ వచ్చినట్టు తెలిసింది… నేనిప్పుడు బెంగళూరులో ఉన్నాను… ఎలాగూ మా ఇంటికి వచ్చారు కాబట్టి మా ఆవిడ మీకు రుచికరంగా వండి పెడుతుంది… తినివెళ్లండి” అంటూ వాట్సాప్ కాల్ చేసి పోలీసులనే కవ్వించాడు. “మీ టెక్నాలజీ కంటే ఐదేళ్లు ముందున్నా… మీరు నన్ను పట్టుకోలేరు… కావాలంటే నా ఫొటో పంపిస్తున్నా… చేతనైతే పట్టుకోండి” అంటూ సత్యేంద్ర సింగ్ పోలీసులకే సవాల్ విసిరాడు.దీంతో షెకావత్ అంశాన్ని ఛాలెంజ్ గా తీసుకున్న బెంగళూరు పోలీసులు అనేక ప్రయత్నాల అనంతరం అతడిని అరెస్ట్ చేశారు. అయితే సత్యేంద్ర సింగ్ షెకావత్ పై హైదరాబాదులో పలు కేసులు ఉండడంతో పీటీ వారెంట్ మీద బెంగళూరు నుంచి తీసుకువచ్చారు. కాగా ప్రస్తుతం అతడు చంచల్ గూడ జైలులో ఉన్నాడు.











