(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
ఉద్యమాల పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేంది. కమ్యూనిస్టు పార్టీలే. ఇది ఒక్కప్పటి మాట. అమరావతి ఉధ్యమం విషయంలో కమ్యూనిస్టులు కాడి పడేశారనే చెప్పవచ్చు. నాలుగు దశాబ్ధాలుగా సీపీఐ, సీపీఎం పార్టీల పరిస్థితి దిగజారుతూనే ఉంది. ప్రధాన పార్టీలతో పొత్తుపెట్టుకునే ఒకటి రెండు సీట్లు గెలవడం తప్ప ఆ పార్టీలు స్వయంగా సాధించింది ఏమీ లేదనే చెప్పాలి.
గతంలో ప్రజాపోరాటాల విషయంలో వామపక్షాల నేతలు రాఘవులు, నారాయణ తీవ్రమైన ఉధ్యమాలే చేశారు. కానీ ప్రజలు ఎవరూ వారికి ఓట్లు వేయలేదు. పేదలకు గుడిసెలు వేయాలన్నా, వారి ఇళ్లు కూల్చివేతలను అడ్డుకోవాలన్నా ఆ ఇద్దరు నేతలు క్షణాల్లో అక్కడ ఉండేవారు. అలా మూడు దశాబ్ధాలు ఉధ్యమాలు చేసినా ప్రజలు తమకు ఓట్లు వేయలేదని స్వయంగా నారాయణ, రాఘవులు మీడియా ఇంటర్వూలో వాపోయారు.
ఏ సమస్య ఉన్నా పేదలు ముందుగా తమను ఆశ్రయించేవారని, ఆ సమస్యపై తీవ్రమైన పోరాటాలు చేశామని అలా వేలాది పేదల కాలనీలు ఏర్పాటు చేయించినా, ఎలక్షన్ వచ్చే నాటికి ప్రజలెవరూ తమకు ఓట్లు వేసి గెలిపించలేదని ఇది తమను బాధించిందని రాఘవులు స్వయంగా చెప్పారు. అందుకేనేమో అమరావతి రాజధాని విషయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పెద్దగా పట్టించుకోలేదనిపిస్తోంది. ఒకరిద్దరు నాయకులు శిబిరాలను సందర్శించి ప్రకటన చేయడం మినహా పట్టించుకుంటున్నది శూన్యం.
అమరావతి రాజధాని ఇష్టం లేదా?
అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో భారీ ఉధ్యమాలు చేసిన వామపక్షాలు అమరావతి రాజధాని విషయంలో ఎందుకు ఉధ్యమించడం లేదు. అగ్రిగోల్డ్ బాధితులకు పది శాతం ప్రభుత్వం చెల్లింపులు చేసింది. ఇందుకు ప్రధాన కారణం వామపక్షాల పోరాటాలే అని చెప్పాలి. అగ్రిగోల్డ్ బాధితుల పక్షాల వామపక్షాల నేతలు ముప్పాళ్ల నాగేశ్వరావు తీవ్రమైన ఉద్యమం నడిపి అనేక సార్లు జైలు కెళ్లారు. మరి అమరావతి రాజధాని విషయంలో వారి వైఖరి అనుమానాలకు తావిస్తోంది.
అడపాదడపా సీపీఐ కార్యదర్శి రామకృష్ణ మాత్రమే అమరావతి రాజధానిపై మీడియాతో మాట్లాడుతూ ఉంటారు. ఇక సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అయితే జగన్ అనుకూల నాయకుడు అనే ప్రచారం ఉంది. ఎంత పోరాడిగా జనం తమకు ఓట్లు వేయరని వామపక్షాల నేతలు భావిస్తున్నారు. అందుకే పోరాటాలను వారు నమ్ముకోవడం లేదు. ప్రధాన పార్టీలతో పొత్తు లేకుండా కనీసం అసెంబ్లీలో అడుగు పెట్టలేమని వారికీ తెలుసు. మరలా పొత్తుల విషయానికి వస్తే మాత్రం వారితో పొత్తు ఒక పట్టాన ముడి పడదు. అందుకే వారితో విసిగి పోయిన టీడీపీ 2019లో కనీసం పొత్తులకు కూడా ప్రయత్నించలేదు. పొత్తులు పెట్టుకున్న జనసేనకు అనేక చికాకులు వచ్చాయి. తగాదాలు కీచులాటలు వారిమధ్య తప్పలేదు.
సీపీఎం కు మూడు రాజధానులే ఇష్టమా?
అవుననే అంటున్నారు. కొందరు రాజకీయ విశ్లేషకులు. 9 నెలలుగా అమరావతి రైతులు ఉధ్యమం చేస్తున్నా సీపీఎం నేతలు అటు వైపు కన్నెత్తి చూడలేదు. అమరావతి రాజధాని తమకు సంబంధం లేనిదిగా వారు బావిస్తున్నారా? లేదా అధికార వైసీపీకి అనుకూలంగా మెదలుతున్నారా? అని కొందరు టీడీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. అయినా ఆ పార్టీ నేతలో ఉలుకుపలుకు లేదు.
విజయవాడలో వామపక్షాల పట్టు సన్నగిల్లిపోయిందా?
ఒకప్పుడు విజయవాడ కమ్యూనిస్టుల కోట. విజయవాడ, మంగళగిరి లాంటిచోట్ల కమ్యూనిస్టులే ప్రజాప్రతినిధులుగా గెలిచిన చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు వారి పరిస్థితి కార్పొరేటర్‌గా కూడా గెలిచే పరిస్తితి లేదు. ఒక్క అగ్రిగోల్డ్ విషయంలో గుంటూరు, విజయవాడ వామపక్షాల నేతలు పోరాడగలిగారు అంటే దానికి కారణం వారి బలం కాదు. అగ్రిగోల్డ్ ఏజంట్లు తీవ్రంగా నష్టపోయి వామపక్షాల నేతలను ఆశ్రయించారు. ఉద్యమానికి జనం అవసరం అయితే అగ్రిగోల్డ్ ఏజంట్లు, బాధితులు పెద్ద ఎత్తున హాజరయ్యేవారు. ఇక కమ్యూనిస్టులు వారి జండాలు పట్టించి విజయవాడలో భారీ ఉద్యమాలే చేశారు.
అమరావతి విషయంలో కమ్యూనిస్టుల జెండా మోసే వారే లేరు. అలాంటప్పుడు ఇక ఉద్యమాలు ఎందుకు దండగని కమ్యూనిస్టులు భావిస్తున్నారు. అందుకే వారు కూడూ మీడియాతో మాట్లాడి వెళ్లిపోతున్నారు. అమరావతికి కమ్యూనిస్టులు చేయి ఇచ్చారని చెప్పవచ్చు. వారు అమరావతి రాజధాని విషయంలో పోరాటాలు చేసిఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కనీసం ఈ పోరాటం ఒక పార్టీకి పరిమితమైనదే అనే అభిప్రాయం రాకుండా ఉండేది.