ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ఎన్నో ఏళ్లుగా మందగమనంలో ఉన్న పనులన్నింటికీ ఊపుతూ ముందుకు కదులుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు తాను ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కోసం తొలి 5 సంతకాలు పెట్టి ప్రజల్లో ఒక భరోసా భావం కల్పించారు. మరోవైపు, చంద్రబాబు బాధ్యతలు చేపట్టక ముందే అమరావతి కళకళలాడడం మొదలుపెట్టింది. గత జగన్ ప్రభుత్వం కారణంగా పూర్తిగా పాడుపడిన అమరావతి కట్టడాలకు చంద్రబాబు వచ్చి రావడంతోనే దుమ్ముదులిపారు.
మొత్తానికి ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడడం ఆలస్యం.. పనులన్నీ చకచకా మొదలువుతున్నాయి. బుధవారం సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు.. గురువారం జూన్ 13న సచివాలయానికి వచ్చి బాధ్యతలు తీసుకున్నారు. శుక్రవారం మంత్రులకు శాఖలు కూడా కేటాయించేశారు. ఇక తర్వాతి ఘట్టం అసెంబ్లీ సమావేశాలు. సాధారణంగా ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడగానే అసెంబ్లీ సమావేశాలు కచ్చితంగా జరుగుతాయి. ఆ రోజే స్పీకర్ ను ఎన్నుకోవడం.. ఆ తర్వాత ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించడం వంటివి జరుగుతాయి.
మరోవైపు ఈ నెల 18న ఏపీ కేబినెట్ తొలి సమావేశం జరపాలని నిర్ణయించింది. ఆ మరుసటి రోజు (19వ తేదీ) నుంచే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలిసింది. అయితే, అసెంబ్లీలో ఇకపై జగన్ స్థానం ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతిపక్ష హోదా కావాలంటే కనీసం 18 స్థానాలు రావాలి. కానీ, వైఎస్ఆర్ సీపీకి 11 సీట్లే వచ్చాయి. అసెంబ్లీ నిబంధనల ప్రకారం ప్రతిపక్ష స్థాయి ఉంటే స్పీకర్ కు ఎడమ వైపు సీట్లు కేటాయిస్తారు. ప్రతిపక్ష నేత ముందు సీటులో కూర్చొంటారు. కానీ, ఇప్పుడు జగన్ తన పార్టీకి చెందిన 11 మందితో కలిసి సాధారణ ఎమ్మెల్యే తరహాలోనే హాజరు కావాల్సి ఉంటుంది.
అదీకాక, ఈ ఐదేళ్లలో అధికారంలో ఉండగా జగన్ టీడీపీ ఎమ్మెల్యేలను ఏరకంగా అసెంబ్లీ పీడించుకొని తిన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏకంగా చంద్రబాబును, ఆయన భార్యను వ్యక్తిగతంగా అవమానిస్తూ మాట్లాడిన నీచమైన చరిత్ర వైసీపీ నేతలది. ఇక టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా టీడీపీ జగన్ ను అసెంబ్లీలో ఇరుకున పెట్టక మానదు. ఆయన అక్రమాలపై ప్రశ్నిస్తుంది. వాటికి జగనే సమాధానం చెప్పాలి. పైగా అధికారం పక్షం సంధించే ప్రశ్నలకు జవాబులు చెప్పలేక జగన్ సతమతం అయ్యే అవకాశం లేకపోలేదు. అందుకే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే 19 నుండి 4 రోజులు జగన్‌కి కాళరాత్రులుగా ప్రచారం జరుగుతోంది.