కూటమి ప్రభుత్వం విశాఖ రీజియన్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా విశాఖ ఎకనమిక్ రీజియన్‌ను తీర్చిదిద్దాలని సూచించారు. వచ్చే ఏడేళ్లలో మరో ముంబయిలా విశాఖ తయారు కావాలన్నారు. విశాఖ ఈ రీజియన్ నుంచి 2032 నాటికి 120 బిలియన్ డాలర్ల సంపద సృష్టి జరగాలన్నారు చంద్రబాబు. ఈ ఎకనమిక్ రీజియన్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి, మన్యం జిల్లాల పరిధిలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా ప్రాజెక్టులు నెలకొల్పాలన్నారు. వివిధ ప్రాజెక్టుల కోసం 8 జిల్లాల్లో లక్ష ఎకరాలు గుర్తించాలన్నారు చంద్రబాబు. 36 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 15.5 మిలియన్ల జనాభా కలిగి ఉన్న విశాఖ రీజియన్‌లో ప్రస్తుతం 49 బిలియన్ డాలర్ల గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ – GDDP నమోదవుతోందన్న చంద్రబాబు…2032 నాటికి 20 నుంచి 24 లక్షల మేర ఉద్యోగాలు పెరిగేందుకు అవకాశం ఉందన్నారు.
విశాఖ అభివృద్ధికి ఏడడుగులు –
విశాఖ రీజియన్ అభివృద్ధిలో ఏడు కీలక రంగాలు కీరోల్ ప్లే చేస్తాయన్నారు చంద్రబాబు. పోర్టు, ఐటీ, వ్యవసాయం, పర్యాటకం, హెల్త్ కేర్, పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పన వంటి 7 గ్రోత్ డ్రైవర్లకు సంబంధించి నీతి ఆయోగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనికోసం 41 ప్రాధాన్య ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉందన్నారు. 6 పోర్టులు, 7 మాన్యుఫ్యాక్చరింగ్ నోడ్లు, 17 మేజర్ వ్యవసాయ క్షేత్రాలు, 6 సర్వీస్ హబ్స్, 12 పర్యాటక హబ్స్‌తో విశాఖ ఎకనమిక్ రీజియన్‌ను అభివృద్ధి చేయాలన్నారు. ఈ ప్రణాళికలు అమలైతే..వచ్చే ఏడేళ్లలో 7.5 లక్షల గృహాలు, 10 వేల హోటల్ గదులు, 20 ఇన్నోవేషన్ సెంటర్లు, 10 కళాశాలలు, 7,000 ఆసుపత్రి బెడ్‌లు, 20 వేల హెక్టార్ల పరిధిలో పరిశ్రమలు, 80 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాల సముదాయం, 60 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో గోదాములు అందుబాటులోకి వస్తాయన్నారు చంద్రబాబు.
దేశంలోని మూడు దిగ్గజ ఉక్కు పరిశ్రమలతో స్టీల్ హబ్‌గా తీర్చిదిద్దడంతో పాటు పెట్రోకెమికల్స్, గ్యాస్ గ్రిడ్, పోర్టుల అభివృద్ధి, మెడికల్ టెక్, షిప్ బిల్డింగ్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, క్లీన్ టెక్, లేబర్ ఇంటెన్సివ్ మాన్యుఫ్యాక్చరింగ్‌పై దృష్టిపెట్టాలన్నారు చంద్రబాబు. వచ్చే ఏడేళ్లలో ఐటీ రంగంలో కనీసం 4-5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యమని చెప్పారు. డేటా సెంటర్లు, స్టార్టప్‌లు-ఇన్నోవేషన్ సెంటర్లకు ప్రాధాన్యమివ్వాలన్నారు.
2032 కల్లా మరో 7 కొత్త రైల్వేప్రాజెక్టులు పూర్తిచేయడం టార్గెట్‌గా పెట్టుకోవాలన్నారు. మాన్యుఫ్యాక్చరింగ్ నోడ్స్, పోర్టులకు కొత్తగా 9 రోడ్డు ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు 77 కి.మీ. మేర వైజాగ్ మెట్రో ప్రాజెక్టు నిర్మాణం 2028-30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యమని చెప్పారు. మూలపేట-విశాఖపట్నం, విశాఖపట్నం-కాకినాడ మధ్య బీచ్ రహదారులు నిర్మిస్తామని సీఎం పేర్కొన్నారు. వాటిని జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామన్నారు. సముద్ర తీరం సంపద నిలయమన్నారు చంద్రబాబు. దాన్ని మరింత వినియోగించుకునేలా చూడాలన్నారు. పర్యాటక రంగాన్ని పరిశ్రమగా గుర్తించామన్నారు. దేశంలోనే తొలిసారి 1998లో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. దాని ఫలితాలు నేటికీ అందుతున్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధికి నీతి ఆయోగ్ సహకారం అవసరమన్నారు చంద్రబాబు.