దేశంలో వృద్ధులకు సామాజిక పింఛన్లు అందుతున్నాయి. భర్త చనిపోయిన మహిళలకు కూడా ప్రభుత్వాలు పింఛన్లు ఇస్తున్నాయి. ఇక జీవన గమనంలో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటన్న విభిన్న ప్రతిభావంతులకు కూడా పింఛన్లు అందుతన్నాయి. ఏపీలో అయితే కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులకు కూడా పింఛన్లు అందుతున్నాయి. అయితే తల్లిదండ్రులు చనిపోయి…తీవ్ర నిరాశానిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న అనాథల గురించి మాత్రం ఏ ఒక్క ప్రభుత్వం గానీ, ఏ ఒక్క నేత గానీ ఆలోచన చేసిన పాపాన పోలేదు.
అయితే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుుడు మాత్రం ఇలాంటి వారి గురించి ఆలోచన చేశారు. ఇతర వర్గాలకు ఇస్తున్నట్లుగానే అనాథలకు కూడా పింఛన్లు అందించి వారి జీవితం ఒంటరి కాదని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందన్న భావనను కలిగించాలన్న దిశగా చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఈ మేరకు గత రెండు రోజులుగా జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆలోచన మేరకు రాష్ట్రంలోని అనాథల గుర్తింపు, అతి త్వరలోనే పింఛన్ల పంపిణీ ప్రారంభం కానున్నాయి.
ఇలా అనాథలకు పింఛన్లు ఇవ్వాలన్న ఆలోచన నిజంగానే ఏ ఒక్కరికి రాలేదు. మరి చంద్రబాబుకు ఈ ఆలోచన ఎలా తట్టిందంటారా? నిత్యం రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం, ఆయా వర్గాలకు సర్కారు నుంచి అందుతున్న సాయం, ఆయా పథకాల్లో ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా?, సంక్షేమ పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలు ఏమిటి? వాటికి ఏ రీతిన చెక్ పెట్టాలి? ఆయా పథకాలను మరింత ప్రభావవంతంగా అమలు చేయడం ఎలా? ఆయా పథకాలను మరింత మంది అర్హులకు చేర్చడం ఎలా? అసలు సంక్షేమ పథకాలన్నీ నిజమైన లబ్ధిదారులకే అందుతున్నాయా? లేదంటే అవినీతి పరులు తినేస్తున్నారా?… ఇలా దాదాపుగా నిత్యం చంద్రబాబు ఆలోచన చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే అనాథల జీవనం ఎలా సాగుతుందన్న దిశగా తనకు తట్టిన ఆలోచనను కాస్తంత లోతుగా తీసుకెళ్లి ఉంటారు. ఈ క్రమంలోనే ఇతర వర్గాలకు ఇచ్చినట్లగా కొంత మొత్తాన్ని అనాథలకు ఇస్తే.. వారి జీవితం సాఫీగా సాగుతుంది కదా అని ఆయన యోచించి ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి,
వాస్తవానికి అనాథల కోసం ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు అనాథ శరణాలయాలను నడుపుతన్నాయి. ఇక్కడ ఒంటరి అనే భావన వారిని వేధిస్తూనే ఉంటుంది. కొందరు అనాథలు వారి బంధువుల వద్ద ఉంటుంటారు. అయితే ఇలా బంధువర్గం వద్ద ఉంటన్న అనాథల పరిస్థితి దారుణంగా ఉంటోంది. అదే సమయంలో తమతో పాటు అనాథల పోషణ కూడా ఆ బంధువులకు ఇబ్బందిగానే ఉంటుంది. మొత్తంగా అనాథలకు ఎక్కడ ఉన్నా ఇబ్బందిగానే ఉంటుందని చెప్పాలి.
అయితే వీరికి సర్కారు అండ దక్కితే… వారి జీవనానికి భరోసా దక్కినట్టే.ఇదే భావన తట్టిన చంద్రబాబు దానిని వెంటనే అమలు చేసేందుకు రంగంలోకి దిగిపోయారు. వెరసి అనాథల జీవనంపై లోతుగా అధ్యయనంచేయడంతో పాటుగా వారికి అండగా నిలిచే దిశగా… ఏకంగా అనాథలకు పింఛన్లు అంటూ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధపడ్డారు. ఇలా అన్ని వర్గాలను తన వారిగా భావిస్తూ సాగుతున్న చంద్రబాబుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా దేశంలోనే అనాథలకు పింఛన్లు ఇస్తున్న తొలి నేతగా చంద్రబాబు రికార్డులకు ఎక్కనున్నారు. వెరసి అనాథల సంక్షేమంలో దేశానికే చంద్రబాబు ఆదర్శంగా నిలవనున్నారు.