అధికారంలో ఉన్న ఐదేళ్లూ అమరావతిలో విధ్వంసానికి పాల్పడి, ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా చేసిన వైసీపీ నేతలు చిత్తుచిత్తుగా ఓడినా తీరు మార్చుకోలేదు. అమరావతిని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే…వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. కొత్త కుట్రలకు తెరలేపుతున్నారు. రెండో విడతలో ఎయిర్‌పోర్టు ఇతర అవసరాల కోసం 44 వేల ఎకరాలు సమీకరించాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంటే..ఈ భూ సమీకరణను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. భూములు ఇచ్చేందుకు అంగీకరించిన గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పి ఆయన అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రాజధాని కోసం ప్రభుత్వానికి భూములు ఇవ్వొద్దని ఆయన చెప్పారని, మనం కూడా అలానే నడుచుకోవాలని రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే మీ భూములన్నీ బీళ్లుగా మారుస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు.
భవిష్యత్ అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రాజధాని విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరింత భూ సేకరణ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అమరావతి మండలంలో 10 గ్రామాలు, పెదకూరపాడు మండలంలో రెండు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అధికారులు రైతుల అభిప్రాయాలు సేకరించారు. మరో రెండు గ్రామాల్లో సభ నిర్వహించాల్సి ఉంది. మెజారిటీ రైతులు భూ సమీకరణకు సానుకూలత వ్యక్తం చేశారు. కొన్ని అభిప్రాయాలు వెల్లడించారు. వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గ్రామ సభల్లో రైతులకు భరోసా కల్పించారు. దీంతో 12 గ్రామాల్లో 34 వేల ఎకరాలు భూ సమీకరణ ద్వారా ఇచ్చేందుకు రైతులు సిద్ధపడ్డారు.
ఐతే రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించడం వైసీపీ నేతలకు నచ్చడం లేదు. దీంతో రంగంలోకి దిగారు. ఆ పార్టీ పెద్దల ఆదేశాలతో ఓ మాజీ ఎమ్మెల్యే గ్రామాల్లోని వైసీపీ ద్వితీయశ్రేణి నేతలకు భూ సమీకరణ జరగకుండా చూడాలంటూ సూచనలు చేసినట్లు తెలిసింది. ధరణికోటలో మాజీ ఎమ్మెల్యే వెంట ఉండే ఓ నేత తమ సామాజికవర్గం వారిని రెచ్చగోట్టేలా మళ్లీ జగన్ వస్తే మీ భూములు బీడుగా మారుస్తామంటూ బెదిరిస్తున్నారని తెలుస్తోంది. లేమల్లెలో కొంతమంది వైసీపీ నేతలు సంతకాలు సేకరించి వాటిని కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలకు తీసుకెళ్లి రైతులు భూ సమీకరణకు ఒప్పుకోవడం లేదంటూ ప్రచారం చేస్తున్నారు. మండెపూడి గ్రామానికి చెందిన ఓ నేత భూములు ఇవ్వొద్దని రెచ్చగొడుతున్నారు. రైతులను గందరగోళంలోకి నెడుతున్నారు