ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణపై జగన్ ప్రభుత్వం దాడి చేసింది. సూర్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ప్రొసీడింగ్స్ విడుదల చేసింది. సూర్యనారాయణపై పూర్తి క్రమశిక్షణ చర్యలు తీసుకునే వరకు సస్పెన్షన్ వేటు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కమిషనర్ గిరిజాశంకర్ ప్రొసీడింగ్స్ విడుదల చేశారు.
2023 మే 30న విజయవాడ పటమట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో సూర్యనారాయణ ఏ-5గా ఉన్నారు. 2019 నుంచి 2021 మధ్యకాలంలో కేఆర్ సూర్యనారాయణ, మెహర్ కుమార్, సంత్య, వెంకట చలపతి, సత్యనారాయణ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. సూర్యనారాయణ మినహా మిగిలిన నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఏ-5 సూర్యనారాయణతో కలిసి వీరు కుట్ర పన్నిన వివరాలను విచారణలో వెల్లడించారు. ఏపీ కమర్షియల్ ట్యాక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సూర్యనారాయణతో పాటు ఇతర నిందితులు తనిఖీల పేరుతో వ్యాపారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం.
సూర్యనారాయణ ఉద్యోగంలో కొనసాగితే విచారణ సజావుగా సాగదని, ప్రభుత్వానికి కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉందని ప్రొసీడింగ్స్ లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ విచారణకు సహకరించకపోవడంతో ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి ఆయనపై క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సస్పెన్షన్ వ్యవధిలో ముందస్తు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది.