(విజయనగరం నుంచి లియోన్యూస్ ప్రత్యేక ప్రతినిధి)
గాన గాంధర్వుడు , సినీ నేపధ్యగాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు సంగీత , సాహిత్యాల పుట్టినిల్లయిన విజయనగరంతో ఎనలేని అనుబంధముంది. విజయనగరం అంటే ఆయనకు అపారమైన అభిమానం. గత 50 సంవత్సరాలుగా చాలా పర్యాయాలు వేరు వేరు కార్యక్రమాలు లో పాల్గొనడానికి బాలు ఇక్కడకు విచ్చేశారు.

ఏ సందర్భంలో ఎప్పుడు వచ్చినా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా స్వచ్ఛందంగా వచ్చేవారు. 70వ దశాబ్దం లో జేసీస్ క్లబ్ సహాయ నిధి కోసం బాలు విజయనగరంలో సంగీత విభావరి నిర్వహించారు. 1996 సంవత్సరం లో రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆహ్వానం మేరకు విజయనగరంలో ఈటీవీ పాడుతా తీయగా మెగా ఫైనల్స్ ను బాలు నిర్వహించారు. ఆ తరువాతి రోజే త్యాగరాజ సంగీత నృత్య కళానికేతన్ ఆర్ధిక సహాయం కోసం కోటలో ఎటువంటి పారితోషకం తీసుకోకుండా ఒక సంగీత విభావరి నిర్వహించారు. 1998 సం లో ఆత్రేయ స్మారక కళా పీఠం పురస్కారాన్ని స్వీకరించారు.
2003 సంవత్సరం కళాతపస్వి కె.విశ్వనాధ్ కు గురజాడ పురస్కారం బహుకరించారు. ఆ సభలో విశిష్ట అతిధిగా పాల్గొన్నారు.
2017 సంవత్సరం లో గురజాడ సాంస్కృతిక సమాఖ్య విశిష్ట పురస్కారాన్ని స్వీకరించారు. 2020 ఫిబ్రవరి 12 వ తేదీన కిన్నెర ఆర్ట్స్ వారు విజయనగరం లో నిర్వహించిన ఘంటసాల జయంతి వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ప్రముఖ సాహితీవేత్త మానాప్రగడ శేషాసాయి అంటే బాలుకు అపార ఆభిమానం. 1996లో ఈటీవీ పాడుతా తీయగా మెగా ఫైనల్స్ జరిగే సమయం లో శేషాసాయితో విజయనగర ప్రాభవం తెలియజెప్పే ” విజయాలకు గోపురం” అనే పాటను వ్రాయించుకుని తానే స్వర పరచి అద్భుతంగా పాడారు.

పువ్వాడ రూమ్ మీట్
విజయనగరం పువాడ ట్రస్ట్ ఛైర్మన్ పువ్వాడ సుబ్బరాజు, బాలు చెన్నైలో ఒకే హాస్టల్ రూమ్ లో ఉండే వారు. విజయనగర సంగీత కళాశాల శతజయంతికి విదేశ పర్యటనలో ఉండడం వలన రాలేకపోతున్నాను. భారత దేశం లో ఉంటే ఒక రూపాయి కూడా ఇవ్వకపోయినా వచ్చేవాడిని అని చెప్పడం ఆయనకు విజయనగరం పై ఉన్న అభిమానానికి నిదర్శనం.
కాపుగంటి కుటుంబ సభ్యుడిగా..
విజయనగరంలో బాలు అత్యంత అభిమానించే వ్యక్తి గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్. వారి కుటుంబంలో ఒకనిగా భావించి విజయనగరం వస్తే వారి ఇంటికి వెళ్ళి ఆతిధ్యాన్ని స్వీకరించే వారు.
కలెక్టర్ ను కొనియాడిన బాలు
ప్రస్తుత కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ హరితయజ్ఞం గురించి ప్రకాష్ ద్వారా తెలుసుకుని, ఈ మధ్య విజయనగరం వచ్చినపుడు కలెక్టర్ కృషిని ప్రత్యేకంగా గుర్తు చేసుకొని కొనియాడడం ఆయన సహృదయతకు నిదర్శనం.
విజయనగరం లో పుట్టి పెరగక పోయినా బాలు గారు మన వారు అనే భావన ఇక్కడ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది అనేది వాస్తవం.