వైఎస్ఆర్ సీపీకి చెందిన ఓ మహిళా నాయకురాలు చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆమెపై వేటు పడుతుందని సూచనలు కనిపిస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో అరకు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి గుమ్మ తనూజా రాణి గెలిచిన సంగతి తెలిసిందే. ఆమె గెలుపుపై సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన కొత్తపల్లి గీత సవాలు చేస్తున్నారు. కొత్తపల్లి గీత దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌కు సంబంధించి అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ, వైసీపీ లోక్‌సభ సభ్యురాలు తనూజా రాణికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది.
2014 నుంచి 2019 మధ్య అరకు నియోజకవర్గానికి ఎంపీగా కొత్తపల్లి గీత ఉన్నారు. ఆమె అప్పట్లో వైసీపీ తరపునే గెలిచారు. తర్వాత ప్రత్యేక పార్టీ పెట్టి దాన్ని బీజేపీలో విలీనం చేశారు. ఇప్పుడు కొత్తపల్లి గీత దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. ఎన్నికల సమయంలో భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తనూజా రాణి తన ఎస్టీ సామాజిక వర్గం గురించి కొన్ని వాస్తవాలను దాచిపెట్టిందని కొత్తపల్లి గీత ఆరోపిస్తున్నారు.
ఎస్టీలకు రిజర్వు చేసిన స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ ఎంపీగా ఎన్నికవ్వాలని కొత్తపల్లి గీత చాలా ప్రయత్నించారు. అరకు లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోవడానికి తనూజా రాణి అనేక ఇతర ఎన్నికల అవకతవకలకు పాల్పడ్డారని ఇప్పుడు గీత ఆరోపిస్తున్నారు. ఓట్ల లెక్కింపు కూడా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగలేదని ఆమె వాదిస్తున్నారు. అలా కొత్తపల్లి గీత పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి శ్రీనివాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనూజా రాణితో పాటు అరకు రిటర్నింగ్ అధికారి, నియోజకవర్గానికి చెందిన ఇతర అభ్యర్థులకు నోటీసులు జారీ చేశారు. తమ కౌంటర్ అఫిడవిట్‌లను సమర్పించాల్సిందిగా కోరుతూ న్యాయమూర్తి కేసును నాలుగు వారాలకు వాయిదా వేశారు.
ఈ ఎన్నికల ద్వారానే తనూజా రాణి రాజకీయాల్లోకి వచ్చారు. అతి పెద్దదైన అరకు పార్లమెంటు నియోజకవర్గంలో కొత్తపల్లి గీతపై 50 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కొత్తపల్లి గీత కూడా గతంలో కోర్టు కేసును ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమెపై ఆమె ప్రత్యర్థులు ఇదే విధమైన ఎన్నికల పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇప్పుడు అదే అస్త్రం ద్వారా కొత్తపల్లి గీత వైసీపీ నాయకురాలిని ఇబ్బందుల్లో పడేశారు.











