విశాఖ పార్లమెంట్ స్థానంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించి రాజధాని అంశంపై ప్రజాభిప్రాయం కోరేందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సిద్ధమా అంటూ టీడీపీ సీనియర్ నేత , మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ప్రతిసవాల్ చేశారు. నాడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామని చంద్రబాబు సవాల్ చేస్తే.. జగన్ పారిపోయారని ఎద్దేవా చేశారు.
విశాఖ ప్రజలు రాజధానిని కోరుకోవట్లేదని, పత్రికల్లో రాయలేని భాషతో సిగ్గుపడేలా ప్రతిపక్షనేతపై మంత్రి వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చెత్త పాలనను ప్రశ్నిస్తున్నందుకే సబ్బం హరి ఇంటిని కూల్చేశారని ధ్వజమెత్తారు.
నరసన్నపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ మంచి టీ షర్టు, దాని మీద టర్కీ టవల్ వేసుకుని రైతులకు అన్యాయం చేస్తున్నాడంటాడు ‘ —-కొడుకు’ అని బూతు భాష వాడారు. ఈ మాటలు విని మీడియా ప్రతినిధులు అవాక్కవ్వగా.. అక్కడితో ఆగకుండా ‘రాసుకోండి. నా మాటలు మొత్తం రాసుకోండి ఫర్వాలేదు. ఎంత నిగ్రహించుకున్నా ఆ మాటలు వచ్చేస్తున్నాయ్’ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. దీనిపై టీడీపీ నేతలు ఎక్కడికక్కడ కౌంటర్ ఇస్తున్నారు.
ఉప ముఖ్యమంత్రి హోదాలో..
ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని నోటికొచ్చినట్టు తిట్టిన విషయం పాఠకులకు తెలిసిందే. రాజధాని అమరావతి ఉద్యమంపై విమర్శలు గుప్పించిన ధర్మాన.. రైతులను రెచ్చగొట్టి, ఉద్యమం నడపడానికి పెయిడ్ వర్కర్స్‌ను పెడుతున్నారని ఆరోపించారు. అమరావతిలోనే రాజధాని ఉండాలి, విశాఖలో వద్దు అనే అజెండాతో చంద్రబాబు ఉత్తరాంధ్రలో పోటీకి రావాలని, తానే బరిలోకి దిగుతానని సవాల్ విసిరారు. మంత్రి ధర్మాన సవాల్‌కు టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ప్రతిసవాల్ చేశారు. శ్రీకాకుళం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు కూన రవికుమార్ నేతృత్వంలో ధర్మానపై నరసన్నపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు.
ధర్మాన నోరుజారి చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద దుమారమే లేపేట్టున్నాయి. ఇటీవల వైసీపీ మంత్రులు నోటికివచ్చినట్టు చేస్తున్న వ్యాఖ్యలు ఈ సందర్భంగా రాష్ట్రంలో చర్చనీయాంశమవుతున్నాయి.











