రేషన్ కార్డుదారులందరూ రూ.20 దసరా మామూలు ఇవ్వాలహో అంటూ గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో డబ్బు వేయించడం కలకలం రేపింది. స్వయానా పౌరసరఫరాల శాఖా మంత్రి ఇలాకాలోనే రేషన్ డీలర్ల దసరా మామూళ్లు ఇవ్వాలంటూ టముకు వేయించడం ఇప్పుడు సంచలనంగా మారింది.
గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో ముగ్గురు రేషన్ డీలర్లు పనిచేస్తున్నారు. వారంతా మాట్లాడుకుని ఒక్కో కార్డుదారుడి నుంచి రూ.20 దసరా చందా వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా గ్రామంలో డప్పువేసే ప్రభాకర్ రావును ఆదేశించారు. ఇంకేముంది ప్రభాకర్ రావు గ్రామంలో డప్పువేసి మరీ విషయం అందరికీ తెలిసేలా, అర్ధం అయ్యేలా పెద్దగా అరచిమరీ చెప్పాడు.
దీంతో గ్రామ రెవెన్యూ అధికారికి విషయం తెలిసింది. గ్రామస్థుల ద్వారా మీడియాకు విషయం తెలియడంతో వారు రెవెన్యూ అధికారిని వివరణ అడిగారు. డప్పు వేసిన మాట నిజమేనని దీనిపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. దీనిపై పై అధికారులకు తెలియజేశామని గ్రామ రెవెన్యూ అధికారి అంగీకరించారు. మండల తహశీల్దార్ ఆంజనేయులును వివరణ అడగ్గా డప్పు వేయించింది నిజమేనని, వారిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మరీ అంత కక్కుర్తా…
రేషన్ డీలర్లకు ప్రభుత్వం కమిషన్ చెల్లిస్తోంది. అయినా వారి ధనదాహానికి దసరా మామూళ్లు వసూలు చేయాలని నిర్ణయించడం అద్దం పడుతోంది. గతంలోనూ ఇలా దసరా మామూళ్లు వసూలు చేసినా ఇంత బరితెగించి డప్పు వేయించలేదని గ్రామస్థులు వాపోతున్నారు. దసరా మామూళ్లు వసూలు చేసుకోవడం మా హక్కు అన్న చందంగా డప్పు వేయించడంపై ఉన్నత అధికారులు కూడా ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.











