(హైదరాబాద్ నుంచి లియోన్యూస్ ప్రత్యేక ప్రతినిధి)
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన కొత్త వ్యూహానికి తెర తీస్తున్నారు. తన తర్వాత కుమారుడు కల్వకుంట్ల తారక రామారావును ముఖ్యమంత్రిగా చేస్తారని అందరూ నిశ్చయించుకున్న వేళ దానికి కూడా రాజకీయంగానే పావులు కదుపుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇంతకు ముందు జిల్లాలకు తానే స్వయంగా వెళ్లి అక్కడి ప్రభుత్వ పాలనతో పాటు పార్టీ కార్యక్రమాలను కూడా దగ్గరుండి చూసుకునే వారు ముఖ్యమంత్రి కేసీఆర్.
ఇక మీదట జిల్లా పర్యటనలకు తాను కాకుండా భవిష్యత్ ముఖ్యమంత్రిగా తెరమీదకు తీసుకురావాలనుకుంటున్న మంత్రి కే.తారక రామారావును జిల్లా పర్యటనలకు పంపాలని నిర్ణయించినట్లు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా చేయడం ద్వారా అటు జిల్లాల్లో పాలన ఎలా సాగుతోందో కే. తారక రామారావు స్వయంగా తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే పార్టీలో సీనియర్లు మారు మాట్లాడకుండా చేయడం మరో ఎత్తుగా చెబుతున్నారు.
అలాగే తన తర్వాత తన కుమారుడు తారక రామారావే ముఖ్యమంత్రి అవుతారనే సందేశాన్ని ఇవ్వడం కూడా కేటీఆర్ పర్యటనల్లో అంతర్భాగమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తాజా ఉదాహరణ మంత్రి కే.తారక రామారావు తాజా వరంగల్ పర్యటన. వర్షాలు, వరదలతో అతలాకుతలమైన వరంగల్ జిల్లాలోను, నగరంలోనూ సుడిగాలి పర్యటన చేశారు కేటీఆర్.
వరంగల్ పర్యటనలో స్ధానికులతో కష్టసుఖాలు పంచుకోవడంతో పాటు వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కూడా కల్సించారు. మరోవైపు అధికార యంత్రాగంతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. మున్సిపల్ శాఖా మంత్రి హోదాలోనే కే.తారక రామారావు పర్యటన కొనసాగినా స్ధానిక మంత్రులు ఎర్రబెల్లి దయాకర రావు, సత్యవతీ రాథోడ్ ల పాత్ర అంతంత మాత్రంగానే ఉంది. వారిద్దరు కేటీఆర్ కు సహచరులే అయినా పెదవి విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
ఇక అధికారులు కూడా ముఖ్యమంత్రే స్వయంగా పర్యటనకు వచ్చారా అన్నంత హడావుడి చేశారు. అక్రమ నిర్మాణాల కారణంగానే వరదలు వస్తున్నాయని, అలాంటి నిర్మాణాలను గుర్తించి తక్షణమే కూల్చివేస్తామని మంత్రి కే.తారక రామారావు ప్రకటించగానే అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. దీంతో పాటు తాను మరో రెండు నెలల తర్వాత జిల్లా పర్యటనకు వస్తానని, అప్పటి అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ఏం చేసారో తనకు నివేదించాలంటూ హుకుం కూడా జారీ చేశారు. ఇదంతా గమనిస్తున్న జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చినట్లుగా అనిపించడం విశేషం. పర్యటనకు ముందు చేసిన ఏర్పాట్లు కూడా అదే స్ధాయిలో ఉండడం మరో విశేషం.
తెలంగాణ ఉద్యమ సమయంలోను, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా కే.చంద్రశేఖర రావు బలం అంతా జిల్లాలే కావడం గమనార్హం. జిల్లా స్థాయి నాయకులను తన మాట తప్ప మరొకటి వినని వారిగా చేసుకుని పార్టీలో వచ్చిన అంసతృప్తులపై విజయం సాధించారు కేసీఆర్. ఇప్పుడు అదే సూత్రాన్ని కుమారుడు కే.తారక రామారావు విషయంలో కూడా అమలు చేయాలన్నది కేసీఆర్ ఉద్దేశ్యంగా కనపడుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నెలకు మూడు జిల్లాల వారీగా పర్యటిస్తూ అటు పాలన పరంగాను, ఇటు పార్టీ పరంగాను బలపడాలన్నది కేటీఆర్ ముందున్న లక్ష్యం. ఇందులో భాగంగా సహచర మంత్రి, బావ హరీష్ రావు నుంచి కూడా ఇబ్బందులు రాకుండా చూడాలన్నది ఈ వ్యూహంలో భాగమని పార్టీలో విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కుమారుడు కేటీఆర్ జిల్లా పర్యటనలకు వెళ్తే ముఖ్యమంత్రి కేసీఆర్ రాజధానిలో ఉండి విధాన పరమైన నిర్ఱయాలు తీసుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుతారని వారంటున్నారు.











