ఈ ఉద్యమం ఆగదు..
హిందూపురాన్ని సత్యసాయి జిల్లాగా ప్రకటించి.. జిల్లా కేంద్రాన్ని హిందూపురం లో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బాలకృష్ణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జిల్లాల పునర్విభజనతో హిందూపురం ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని నిరసిస్తూ శుక్రవారం నియోజకవర్గ కేంద్రంలో బాలయ్య నేతృత్వంలో ఆందోళనలను చేపట్టారు. ప్రధాన కూడళ్లు మీదిగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. ఈ ర్యాలీ స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. రాజకీయాలను పక్కనపెట్టి పార్టీలకు అతీతంగా పలువురు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టారు. దీక్ష స్థలానికి బాలయ్య అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని నినాదాలు చేశారు. ఉద్యమ కార్యచరణపై సాయంత్రం నిర్వహించే అఖిలపక్ష నేతల భేటిలో బాలకృష్ణ చర్చించనున్నారు.
పార్టీలన్నీ ఒక్కతాటిపైకి..
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించేంతవరకు అందరం రాజకీయాలను పక్కనపెట్టి, అతీతంగా, ఐక్యంగా పోరాడాలని స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ పిలుపు మేరకు అధికార వైసీపీ మినహా అన్నీ రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చాయి. ఉదయం నుంచే బాలయ్య ఇంటివద్దకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు చేరుకున్నారు. ర్యాలీలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సేవ సంస్థలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని, జిల్లా కేంద్రాన్ని సాధించే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని నినాదాలు చేశారు. సాయంత్రం బాలయ్య చేపట్టిన మౌనదీక్ష ముగిసిన తరువాత, అఖిలపక్షంతో సమావేశం నిర్వహిస్తారు. ఉద్యమ కార్యాచరణను ప్రకటించి, నిరంతరం నిరసలు తెలుపనున్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి.