ఎవరికైనా కష్టమొస్తే వెంటనే స్పందిస్తేనే ఎవరికైనా ఉపయోగం ఆ విషయంలో నందమూరి బాలకృష్ణ ఈ మధ్య ముందువరుసలో ఉంటున్నారు. కరోనా కాలంలో కూడా బాలయ్యబాబు తనదైన శైలిలో జనాన్ని ఆదుకోడానికి ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి సహాయనిధిగా భారీగా విరాళం ఇచ్చారు. తాజాగా హైదరాబాద్ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారని ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ నగరాన్ని కొన్ని రోజులుగా వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేని భారీ వర్షాలతో జనం నానా అవస్థలు పడ్డారు.
అనుకోకుండా వరదలు రావడంతో హైదరాబాద్లోని అనేక కాలనీల వాసులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాంటి వారందరినీ ఆదుకునేందుకు బాలయ్య రూ. 1.50 కోట్లను విరాళంగా ప్రకటించారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. దీంతోపాటు పాతబస్తీలో బసవతారక రామ సేవా సమితి ఆధ్వర్యంలో 1000 కుటుంబాలకు బిర్యానీ ప్యాకెట్లు అందేలా ఏర్పాట్లు చేశారని కూడా అంటున్నారు. తెలుగు సినిమా రంగం కరోనా కారణంగా సంక్షోభానికి గురైనపుడు సినీ కార్మికులను ఆదుకునేందుకు కూడా భారీ విరాళం ప్రకటించారు.
ఆ తర్వాత తన నియోజకవర్గంలో కోవిడ్ ఆస్పత్రికి కూడా భారీ విరాళం ప్రకటించారు. కోవిడ్ పరీక్షలకు అవసరమైన సామగ్రిని ఏర్పాటు చేశారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో కూడా ఎన్నో కార్యక్రమాలను ఆయన చేపట్టారు. హైదరాబాద్ వరద బాధితులకు అండగా నిలిచిన తొలి హీరో బాలకృష్ణ గా ప్రచారం సాగుతోంది. కొంతమంది దీన్ని కొట్టి పారేస్తున్నారు. కావాలనే ఇలా ప్రచారం చేస్తున్నారని, ఆయన సహాయం చేయడంలో నిజం లేదని కూడా మరో పక్క ప్రచారం జరుగుతోంది. బాలయ్యను ఇరుకున్న పెట్టేందుకు ఇలా ప్రచారం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.











