అధికార వైసీపీకి బిగ్ షాక్ తగలనుందా..?? ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి స్వయానా బంధువు అయిన బాలినేని శ్రీనివాస రావు… సొంత పార్టీకే షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు.. కొన్ని రోజుల క్రితం జిల్లాల సమన్వయ కర్త పదవికి రాజీనామా చేసిన ఆయన తాజాగా తన సొంత నియోజకవర్గం ఒంగోలు సాక్షిగా బల ప్రదర్శన చేశారు.. హైదరాబాద్ నుండి ఒంగోలుకి వెళ్లిన ఆయనను రిసీవ్ చేసుకోవడానికి భారీగా అభిమానులు వచ్చారు.. అయితే, ఎక్కడా వైసీపీ జెండా, కండువాలు లేకపోవడం పార్టీ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది..
వైసీపీ అధిష్టానంపై గత కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు బాలినేని.. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో ఉమ్మడి ఒంగోలు జిల్లాకే చెందిన ఇద్దరి మంత్రులలో తనను మాత్రమే తొలగించి, మరో మంత్రి ఆదిమూలపు సురేష్ ని కొనసాగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.. అప్పటినుండి కొనసాగుతోన్న విబేధాలు తాజాగా డీఎస్ పీ అధికారుల బదిలీ ప్రక్రియలోనూ తన మాట చెల్లుబాటు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. బాలినేని కోసం డీఎస్ పీ అధికారుల బదిలీలను మార్చివేసినా.. ఆయన కోపం మాత్రం చల్లారలేదు.. తాజాగా ఒంగోలు వచ్చిన ఆయన ప్రెస్ మీట్ పెట్టి వాపోయారు.. తనను పార్టీలోని కొందరు వ్యక్తులే టార్గెట్ చేస్తున్నారని, తనపై వ్యతిరేక వార్తలు ప్రచారం చేస్తున్నారని కన్నీటి పర్యంతం అయ్యారు.. పంచ ప్రభాకర్, గోనె ప్రకాశ్ రావు లాంటి వారితో తనపై నెగిటివ్ కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బాలినేని.
తాజా పరిణామాలతో బాలినేని విసిగిపోయారనే చర్చ సాగుతోంది.. దీంతో, ఆయన పార్టీ మారతారనే ప్రచారమూ జోరందుకుంది. గత కొంతకాలంగా ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో టచ్ లో ఉన్నారనే వదంతులు ఉన్నాయి.. వాటిని బలపరుస్తూ.. బాలినేని తమ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని స్వాగతం పలుకుతున్నారు జనసేన నేతలు..
మరోవైపు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మీయుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు.. బాలినేని టీడీపీలో జాయిన్ అవుతారని తెలిపారు.. ఆయన ఎన్టీఆర్ భవన్ వర్గాలతో టచ్ లో ఉన్నారని అభిప్రాయ పడ్డారు.
మరోవైపు, పార్టీ మార్పు వార్తలను బాలినేని ఖండిస్తున్నారు. తనకు జగన్ అంటే ప్రాణం అని, ఆయనతోనే తన ప్రయాణం అని తేల్చి చెప్పారు.. మొత్తమ్మీద, వైసీపీ హై కమాండ్ పై గుర్రుగా ఉన్న ఆయన ఆ పార్టీకి ఝలక్ ఇచ్చి…. జనసేన, టీడీపీ తీర్ధం పుచ్చుకుంటారా.. లేదా.. అనేది హాట్ టాపిక్ గా మారుతోంది..