ముఖ్యమంత్రి జగన్ పరిపాలనలో పోలీసులు ఆయన్ని కాదని వ్యవహరించగలరా? అసలు అది ఊహించలేం కదూ! కనీసం అధికార పార్టీ నేతలపై, కనీసం కార్యకర్తలపై ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోని ఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది సీఎం జగన్ పైనే ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. అదీ ముఖ్యమంత్రి సొంతూరు అయిన పులివెందులలో. సీఎం జగన్ లక్షన్నర కోట్ల అవినీతి చేశారంటూ భారత చైతన్య యువజన పార్టీ అధినేతగా ఉన్న రామచంద్రయాదవ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుని పులివెందుల పీఎస్‌లోని ఎస్సై తీసుకున్నారు కూడా. చక్కగా ఫోటోలు కూడా దిగారు. ఈ ఘటనతో అంతటా ఆశ్చర్యం వ్యక్తం అయింది. అసలు ఈ ఫిర్యాదు అందుకున్న ఎస్సై పరిస్థితి ఏంటని ఆసక్తిగా చూస్తున్నారు. సస్పెండ్ చేస్తారో లేక వీఆర్ కు పంపుతారో అని చర్చించుకుంటున్నారు.
పులివెందుల పోలీసులు జగన్ రెడ్డిపై ఇలాంటి ఫిర్యాదును ఎలా స్వీకరించారు? అసలు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనే ఆశ్చర్యం అందరిలోనూ కలిగింది. జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి కార్యకలాపాలపై విచారణ చేయాలని రామచంద్ర యాదవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీలో జగన్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి కార్యకర్తలు సహా ప్రజా ప్రతినిధులు అందరూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఘాటుగా ఫిర్యాదులో రాశారు.
అంతేకాదు, ఏయే శాఖలో ఎంత ఎంత దోచుకున్నారో కూడా ఫిర్యాదులో వివరించారు. మద్యం ద్వారా 50వేల కోట్లు, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రూ.9వేల కోట్లు, ఇసుక ద్వారా 12వేల కోట్లు, చుక్కల భూముల ద్వారా 20 వేల కోట్లు, గ్రానైట్‌లో 30వేల కోట్లు, విద్యుత్ ఒప్పందాలు, కొనుగోళ్లతో రూ.10వేల కోట్లు, ఎర్రచందనం ద్వారా రూ.15వేల కోట్లు దోచుకున్నారని రామచంద్ర యాదవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇంకా వివిధ కాంట్రాక్టుల ద్వారా కూడా అధిక సొమ్ము కాజేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని పోర్టులు, అమూల్, బైజూస్ నుంచి కమీషన్లు, సినిమా, ఇతర పరిశ్రమల నుంచి వాటాలు.. అన్ని కలిపి 1.65 లక్షల కోట్లు వెనకేశారని ఆరోపించారు. వీటితోపాటు బయటకు రాని సీక్రెట్ జీవోలు, భూముల కేటాయింపులు ఎన్నో ఉన్నాయని ఆరోపించారు. వైఎస్ జగన్ అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రామచంద్ర యాదవ్ తన ఫిర్యాదులో కోరారు. జగన్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. జగన్ కు దమ్ము ధైర్యం ఉంటే అవినీతి చేయలేదని ప్రమాణం చేయాలని రామచంద్ర యాదవ్ ఛాలెంజ్ చేశారు.











