అక్కినేని నాగార్జున ‘బిగ్ బాస్’ షూటింగ్ ప్రారంభించేశారు. ప్రోమో షూట్ లో ఆయన పాల్గొన్నారు. కరోనా మరింతగా విజృంభిస్తున్న ఈ సమయంలో కొత్త షూటింగులు మొదలు కావడానికి, అగ్రహీరో తాను కూడా ఒక కారణం కావడం కరక్టేనా?
కరోనా మహమ్మారి రోజు రోజుకూ ప్రబలంగా విస్తరిస్తోంది. ఆర్థిక, రాజకీయ ఉన్నత హోదాలు ఏవీ ఈ కరోనా ముందు పనిచేయడం లేదు. అనేక రాష్ట్రాల్లో మంత్రులకు కరోనా సోకింది, ఒక మంత్రి చనిపోయారు కూడా! కేంద్రం హోంమంత్రి అమిత్ షా, కర్నాటక సీఎం యడియూరప్ప కూడా పాజిటివ్ గా తేలారు. ఇలాంటి కీలకమైన సమయంలో 61ఏళ్ల నాగార్జున… కరోనాతో చెలగాటం ఆడుతున్నట్లుగా షూటింగ్ కు సిద్ధం కావడం కరక్టేనా? అనే చర్చ నడుస్తోంది.
‘‘లైట్స్, కెమెరా, యాక్షన్ లతో తిరిగి ఫ్లోర్ మీదికి వచ్చేశాను.. వావ్’’ అంటూ ఆయన తన సంతోషాన్ని ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నిజంగా ఇది సంతోషకరమైన వార్తేనా? అభిమానులు అందరూ తమ హీరో.. తిరిగి కెమెరా ముందుకు వచ్చేసినందుకు మురిసిపోతున్నారా? లేదా… తమ హీరో ప్రమాదంతో చెలగాటం ఆడుతున్నాడని టెన్షన్ పడుతున్నారా? నాగార్జున ఇంతకీ ఎలాంటి పరిస్థితిని క్రియేట్ చేసినట్టు?
కరోనా లాక్‌డౌన్ సీజన్లు పూర్తయిన తర్వాత.. సినీ ప్రముఖులు కూడా చాలా మంది.. షూటింగులు పునఃప్రారంభించడానికి ఉత్సాహం చూపించారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి.. పరిమితమైన క్రూతో షూటింగులు అనుమతించాలని కోరారు. ట్రయల్ షూట్స్ కూడా చేసిచూపించారు. మొత్తానికి ప్రభుత్వాల నుంచి షూటింగులకు అనుమతి సంపాదించారు.
ఈ అనుమతి అనేది టీవీ సీరియల్స్‌కు, వెబ్ సిరీస్‌కు మాత్రం ఉపయోగపడింది. అయితే అవి కూడా మొదలుకాగానే.. అనేక అపశకునాలు ఎదురయ్యాయి. టీవీ సీరియల్ నటులు వరుసగా అనేకమంది కరోనా బారిన పడ్డారు. ఈ దెబ్బకు… షూటింగుల పునఃప్రారంభాన్ని బలంగా కోరిన పెద్ద హీరోలు ఎవ్వరూ సెట్స్ మీదకు రాలేదు. చిరంజీవి, రాజమౌళి, పవన్ కల్యాణ్, మహేష్ తదితరుల చిత్రాలన్నీ ఆగిపోయి ఉన్నాయి.
కానీ తెలుగు బుల్లితెరమీదికి బిగ్ బాస్ సిద్ధం అవుతోంది. ఇంత అర్జంటుగా బిగ్ బాస్ -4 మొదలు కాకపోయినంత మాత్రాన కొంప మునిగిపోయిందేమీ లేదు. కానీ కరోనా భయానికి ప్రజలు చాలా వరకు ఇళ్లలోనే కూర్చుని టీవీలకు అతుక్కుపోయి ఉంటున్న రోజుల్లో.. వ్యూయర్‌షిప్‌ను క్యాష్ చేసుకోడానికి బిగ్‌బాస్ నిర్వాహకులు ఆలోచించి ఉండొచ్చు. కానీ.. కార్యక్రమ ప్రయోక్తగా నాగార్జున అలాంటి ఆలోచనకు ఎందుకు సహకరించడం. బిగ్‌బాస్ విషయంలో కంటెస్టెంట్లను.. కరోనా పరీక్షలు చేసిన తర్వాత హౌస్ లోకి పంపి, ఆ రకంగా.. జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని వారు చెప్పవచ్చు గాక.. కానీ, ఏరకంగా చూసినా.. షూటింగులు కరోనా వ్యాప్తికి పరోక్ష కారణాలే అవుతాయి కదా అన్నది కీలకాంశం. ఆయన వెళ్లినది ప్రోమో షూటింగ్‌కే కావొచ్చు… కానీ అది మంచిదేనా?
ఆమధ్య బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ కూడా ఒక ప్రోమో షూటింగ్‌కు హాజరయ్యారు. ఆయన కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ కరోనా బారిన పడ్డారు. కొన్ని రోజుల తరబడి.. ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత.. క్షేమంగా బయటపడ్డారు. అలాంటి ఉదాహరణల నుంచి నాగార్జున ఎందుకు జాగ్రత్తలు నేర్చుకోలేదు.
నాగార్జున ‘మన్మధుడే’ అనడంలో సందేహం లేదు. కానీ, ఆయన వయస్సు.. ఈ నెలాఖరు నాటికి 61 సంవత్సరాలు నిండుతుంది. 60 ఏళ్లు దాటిన వారంతా కరోనా విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం తొలినాటినుంచి హెచ్చరిస్తూనే ఉంది. నిజానికి నాగ్ షూటింగులో కూడా ఆయన మేకప్ మేన్, ఇతర క్రూ.. పూర్తిగా పీపీఈ కిట్లు ధరించి కనిపిస్తున్నారు. అయినప్పటికీ.. ఈ వయసులో నాగార్జున కరోనాతో చెలగాటం ఆడుతున్నట్లుగా ఇలాంటి సాహసాలు చేయడం అవసరమా? అని అభిమానులే బాధపడుతున్నారు.











