కరోనా విజృంభిస్తున్న వేళ వచ్చే నెల 17 నుంచి 25 వరకు జరగనున్న దసరా ఉత్సవాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దుర్గగుడి ఆలయ కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంలో రోజుకు కేవలం 10 వేల మంది భక్తులను మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. గతంలో దసరా ఉత్సవాల సమయంలో ప్రతి రోజూ 2 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేవారు. కరోనా నేపథ్యంలో భక్తుల సంఖ్యను రోజుకు 10 వేలకు కుదించారు. ఇందుకు సంబంధించి ఆన్ లైన్లో టిక్కెట్లు అందుబాటులో ఉంచనున్నారు. ఆన్ లైన్లో టికెట్ బుక్ చేసుకున్నవారికే దసరా సమయంలో అమ్మవారి దర్శన భాగ్యం కలగనుంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 వరకూ దర్శనానికి అనుమతిస్తారు.
సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు తప్పనిసరి
దుర్గగుడి దసరా ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని అర్చకులతో సహా, ఆలయ సిబ్బంది మొత్తానికి కరోనా టెస్టులు తప్పనిసరి చేస్తూ ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. భక్తుల సంఖ్యను 90 శాతం తగ్గించడం ద్వారా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని ఆలయ కమిటీ అభిప్రాయపడింది. దీంతోపాటు ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో శానిటైజ్ చేయనున్నారు. అంతేకాదు దర్శనానికి వచ్చిన భక్తుల చేతులను శానిటైజ్ చేయడంతోపాటు, టెంపరేచర్ గన్ తో పరీక్షలు చేయనున్నారు. కరోనా కట్టడిలో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నామని భక్తులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని, తప్పనిసరిగా మాస్కు ధరించి అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఆలయ కమిటీ సూచించింది.











