ఉత్తరాంధ్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫస్ట్ విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. ఇప్పటికే విమానాశ్రయానికి సంబంధించి 96 శాతం పనులు పూర్తయ్యాయి. మరో 4శాతం పనులు త్వరలో కంప్లీట్ కానున్నాయి. వచ్చే జూన్ నాటికి పూర్తిస్థాయిలో విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్ర రూపు రేఖలు పూర్తిగా మారబోతున్నాయి. ఐతే ఇప్పుడు టీడీపీ, వైసీపీ మధ్య క్రెడిట్ వార్ మొదలైంది. మొదట్లో ఎయిర్‌పోర్టు నిర్మాణాన్నే వ్యతిరేకించి, అధికారంలో ఉన్న నాడు ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను ఏనాడూ పట్టించుకోని జగన్…ఇప్పుడు క్రెడిట్ కోసం పాకులాడుతున్నారు. ఎయిర్‌పోర్టుకు సంబంధించి మెజార్టీ పనులు తన హయాంలోనే పూర్తయ్యాయంటూ నిస్సిగ్గుగా ట్వీట్ చేశారు.
పునాది వేసింది చంద్రబాబే –
భోగాపురం విమానాశ్రయానికి 2014-19 మధ్యకాలంలోనే శంకుస్థాపన రాయి పడింది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు భూసేకరణ ప్రక్రియను దాదాపు పూర్తి చేసి, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో చర్చలు జరిపారు. అప్పుడు మోదీ కేబినెట్‌లో విమానయాన శాఖ మంత్రిగా ఉన్న అశోక గజపతి రాజు వేగంగా విమానాశ్రయానికి సంబంధించిన అనుమతులు మంజూరు చేశారు. 2019 ఎన్నికలకు ముందే చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేశారు. అయితే, అప్పట్లో ఉన్న విమానాశ్రయ నమూనాను, ఒప్పందాలను తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం మార్చేసింది.
వైసీపీ హయాంలో జాప్యం – మళ్ళీ శంకుస్థాపన
నిజానికి, 2019 ఎన్నికలకు ముందు ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను జగన్ వ్యతిరేకించారు. ఎర్ర బస్సు కూడా రాని పల్లెలకు ఎయిర్‌పోర్టు ఎందకంటూ ఎద్దేవా చేశారు. ఎయిర్‌పోర్టు పనులను ఆపేందుకు కోర్టు కేసులు వేయించి స్థానిక ప్రజలను రెచ్చగొట్టారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి వేల ఎకరాల భూములెందుకని ప్రశ్నించారు. 2019 అధికారంలోకి వచ్చిన పాత కాంట్రాక్టులను రద్దు చేశారు జగన్. కొత్తగా GMR సంస్థకు బాధ్యతలు అప్పగించారు. భూసేకరణలో ఉన్న చిన్నచిన్న కోర్టు వివాదాలను కూడా పట్టించుకోలేదు. సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు చెల్లికి మళ్లీ పెళ్లి అనే సినిమా డైలాగ్ తరహాలో మరోసారి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు జగన్. కానీ పనులు మాత్రం ముందుకు సాగలేదు. జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి కేవలం 20 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరపు రామ్మోహన్ నాయుడు ఉండడం కూటమికి కలిసి వచ్చింది.పనుల్లో వేగం పెరిగింది. సీఎం చంద్రబాబు సూచనలతో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా ఎయిర్‌పోర్టు పనులను పర్యవేక్షించారు. జెట్ స్పీడ్‌లో అవసరమైన అనుమతులు, నిధులు విడుదల చేశారు. 18 నెలల వ్యవధిలోనే 96 శాతం పనులు పూర్తి చేశారు. ఆదివారం ట్రయల్ సక్సెస్ అయింది. భోగాపురం ఎయిర్‌పోర్టులో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండైంది. ఢిల్లీ నుంచి తొలి ఎయిర్ ఇండియా వ్యాలిడేషన్ ఫ్లైట్ భోగాపురం రన్‌వేపై ల్యాండ్ అయింది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విమానంలోనే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ విమానాలు ల్యాండ్ అయ్యేలా భోగాపురం ఎయిర్‌పోర్ట్ రన్‌వేని రూపొందించారు.
ఐతే,నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది వైసీపీ వ్యవహారశైలి. అధికారంలో ఉన్న నాడు ఎయిర్‌పోర్టు నిర్మాణపనులను గాలికొదిలేసిన ఫ్యాన్ పార్టీ నేతలు ఇప్పుడు తమ వల్లే ఎయిర్‌పోర్టు పూర్తయిందని చెప్పుకోవడం సిగ్గు చేటు. మంత్రి నారా లోకేష్ సైతం జగన్ క్రెడిట్ చోరీ ప్రయత్నాలపై మండిపడ్డారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ అడ్డుకున్న ఘనత ముమ్మాటికీ జగన్‌దేనన్నారు. క్రెడిట్ తీసుకోవడానికి కాస్తైన సిగ్గుండాలంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు జగన్ ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకించిన వీడియోను జత చేశారు.











