విజయనగరం జిల్లా భోగాపురం దశ తిరిగింది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తి కావడంతో.. ఈ ప్రాంతం ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందడానికి సర్వం సిద్ధమయింది. హైదరాబాద్‌లోని శంషాబాద్, ఢిల్లీ, నవీముంబైలో నిర్మించిన కొత్త ఎయిర్‌పోర్టులకు ఏమాత్రం తీసిపోని విధంగా.. విశాఖపట్నం సమీపంలోని భోగాపురంలో అల్లూరి సీతారామారాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మించారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్లానింగ్, డైరెక్షన్‌లో.. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు కృషితో రికార్డు సమయంలో భోగాపురం విమానాశ్రయం పూర్తయింది. జనవరి 4న ఇక్కడి రన్‌వేపై మొదటి విమానం ల్యాండ్ అయింది.
2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి 20 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. చంద్రబాబు సీఎం అయ్యాకే.. కీలకమైన సాంకేతిక అనుమతులు.. నిధులు సాధించారు. 2 వేల 200 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించగా.. అదనంగా 500 ఎకరాల్లో ఏవియేషన్ అనుబంధ పరిశ్రమలు వస్తున్నాయి. వీటి ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇక్కడ ప్రపంచ స్థాయి మెయింటెనెన్స్.. ఓవర్‌హాలింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎంఆర్‌ఓ కేంద్రంలో విమానాలకు రిపేర్లు, సర్వీసింగ్ చేస్తారు. దేశంలో ఏవియేషన్ ఇండస్ట్రీ భారీగా విస్తరిస్తున్న సమయంలో.. విమానాల సర్వీసింగ్‌కి మంచి డిమాండ్ ఉంది. ఫ్లయిట్ మెయింటెనెన్స్‌తో హై పేయింగ్ జాబ్స్ భారీగా వస్తాయి.
జీఎంఆర్, మాన్సాస్ సంస్థల భాగస్వామ్యంలో.. ఇక్కడ ఏవియేషన్ ఎడ్యూ సిటీ నిర్మాణం జరుగుతోంది. పైలెట్లు, ఎయిర్ హోస్టెస్‌లతో పాటు.. విమానాలు, విమానాశ్రయాల్లో వివిధ విభాగాల్లో పని చేసే సిబ్బందికి ట్రెయినింగ్ ఇస్తారు. దేశంలోని పైలట్లలో 25 శాతం.. ఫ్లయిట్ క్రూలో సగం మందిని ఇక్కడి ట్రైనింగ్ సంస్థల నుంచే పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. నాలుగైదు నెల్లలో ఎయిర్‌పోర్టు.. రెండు మూడేళ్లలో ఏవియేషన్ అనుబంధ సంస్థలు పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ ప్రారంభిస్తాయి. అప్పుడు చూస్తే.. ఈ ప్రాంతం రూపు రేఖలు సమూలంగా మారిపోతాయి. భోగాపురంలో ఉన్నామా.. సింగపూర్‌లో ఉన్నామా అని ఆశ్చర్యపోవడం ఖాయం.











