తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి మళ్లీ కరోనా సోకింది. ప్రస్తుతం తిరుపతిలోనిరుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కుమారుడు అభినయరెడ్డి కూడా కరోనా రీ ఇన్ఫెక్షన్ కు గురయ్యారు.
ఆగస్టు 25వతేదీన భూమన కరుణాకర్ రెడ్డికి తొలిసారి కరోనా సోకింది. స్థానికంగానే రుయా ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకున్నారు. కరోనా సోకిన వైసీపీ ప్రముఖులు అనేక మంది హైదరాబాదులోని పెద్ద పెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లోను, స్థానికంగా ఉండే పెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లోను చికిత్సలు చేయించుకున్నారు. కానీ భూమన మాత్రం.. స్థానికంగా ఉండే ప్రభుత్వాస్పత్రి రుయానే ఆశ్రయించారు. అక్కడే అడ్మిట్ అయి చికిత్స తీసుకున్నారు. కరోనా నెగటివ్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్లారు. ఒకసారి కరోనా సోకి, కోలుకున్న నెల రోజుల తర్వాత మళ్ళీ కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
కొడుకు అభినయ్ కు కూడా..
ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తనయుడు అభినయ్ రెడ్డికి సైతం వారం క్రితమే కరోనా రీ ఇన్ ఫెక్షన్ అయినట్లుగా తేలింది. ఆయన కూడా ఇది వరకే రుయాలో చికిత్స పొందారు. తండ్రి కుమారులకు కరోనా రీ ఇన్ఫెక్షన్ రావడంతో వైద్య వర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది.
చురుగ్గా ప్రజల్లో ఉండే నేత..
భూమన కరుణాకర్ రెడ్డి.. చాలా చురుగ్గా ప్రజల్లో ఉండే నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. నిజానికి కరోనా చాలా ప్రబలంగా ఉన్న రోజుల్లో కూడా ఆయన లెక్క చేయకుండా ప్రజాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. శానిటైజర్ తాగి కొందరు మృతి చెందిన సందర్భంలో స్వయంగా వెళ్లి వారి అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నారు. ఒక వ్యాధిగ్రస్తుడైన భిక్షగాడికి ఆర్థిక సాయం అందించడం కోసం.. ఆ భిక్షగాడిని కూర్చోబెట్టిన చిన్న తోపుడు బండికి స్వయంగా తానే తాడుకట్టి తిరుపతి పురవీధుల్లో లాగుతూ.. ఆయన కొంతదూరం భిక్షాటన తరహాలో చేసి.. నిధులు, విరాళాలు సేకరించి.. అతనికి అందజేశారు.











