తొలితరం హీరోయిన్లలో ఇప్పటికీ ఓ కథానాయిక మన ముందే ఉన్న విషయం మీకు తెలుసా? తన 12వ ఏటనే బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి కథానాయికగా, నిర్మాతగా ఆమె ఎందరికో సుపరిచితురాలు.
విశేషం ఏమిటంటే తెలుగు సినిమా లెజండ్ నందమూరి తారకరామారావును నటుడిగా, హీరోగానూ పరిచయం చేసింది కూడా ఆమే. ఒక్క ఎన్టీఆరే కాదు ఎస్వీ రంగారావు, ఘంటసాల, అంజలీదేవి లాంటి ఎందరో అతిరథమహారథులను ఆమె సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆమె ఎవరో కాదు మీర్జాపురం రాజా సతీమణి కృష్ణవేణి. డిసెంబరు 26వ తేదీ ఆమె పుట్టిన రోజు. 97 ఏళ్ల వయసులోనూ ఆమె చాలా చురుకుగా మన కళ్లముందే ఉన్నారు. కరోనాని సైతం లెక్క చేయకుండా నిండు నూరేళ్ల జీవితానికి ఆమె చేరువవుతున్నారు.
1924లో జన్మించిన ఆమె తన 12వ ఏటనే సినిమా రంగంలో అడుగుపెట్టారు. సతీఅనసూయ (ధ్రువ) సినిమాతో బాల నటిగా సినిమా రంగంలో అడుగుపెట్టారామె. ఆ తర్వాత కథానాయికగా 15 సినిమాలు చేశారు. మీర్జాపురం రాజాతో వివాహం జరిగాక చిత్ర నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. కొన్ని సినిమాలకు ప్రత్యక్షంగా, మరి కొన్నిటికి పరోక్షంగా ఆమె నిర్మాతగా వ్యవహరించారు. మంచి గాయని కూడా. ఆమె పుట్టిన రోజు సందర్భంగా మాట్లాడినప్పుడు ఆనాటి విశేషాలను ‘లియో న్యూస్’కు వివరించారు. కృష్ణవేణి గారికి లియో న్యూస్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటోంది.
* మీ సొంతూరు ఏది.. ఆ వివరాలు చెప్పండి?
– నేను పుట్టింది రాజమండ్రిలోనే. నాన్నగారు పశ్చిమగోదావరి జిల్లాలోని పంగిడిగూడెం రాజా దగ్గర వైద్యుడిగా చేసేవారు. నా ఆరో ఏటనే అమ్మ చనిపోవడతో నాన్న వేరే పెళ్లి చేసుకున్నారు. వారిద్దరి మధ్య కూడా పొసగక విడిపోవాల్సి వచ్చింది. దాంతో నేను రాజమండ్రిలోనే బాబాయి గారింట్లో పెరిగాను. వరసకు ఆయన బాబాయి అవుతారు సొంత బాబాయి కాదు.
* మీ వారి పేరు చెబుతారా?
– మావారి పేరు మేకా వెంకట్రామయ్య అప్పారావు. రంగయ్య అప్పారావుగారు మావారికి సోదరుడు.
* అసలు ఈ అప్పారావు ఎవరు? పేరు చివరి ఈ పేరు ఎందుకు వస్తోంది?
– అది మావారి వంశానికి వారసత్వంగా వస్తోంది. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతోంది.
* రాజా వారితో మీది సహజీవనం అనుకోవచ్చా?
– మాది సహజీవనం కాదు వివాహమే. ఆయన మొదటి భార్య భూదేవి సన్యాసం తీసుకోవడం వల్ల నన్ను ఇష్టపడ్డారు. పెళ్లి ప్రతిపాదన ఆయనే తెచ్చారు. మా బాబాయితో మాట్లాడి పెళ్లి చేసుకున్నారు.
* మిమ్మల్ని రెండో పెళ్లి చేసుకుంటే మొదటి భార్య నుంచి అభ్యంతరాలు రాలేదా?
– ఎందుకు రాలేదు.. వచ్చాయి. అందుకే రహస్యంగా విజయవాడలోని సత్యనారాయణపురంలో పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత అందరం బాగానే కలిసిపోయాం. భూదేవికి నలుగురు పిల్లలు. నాకు ఒక్కటే కుమార్తె. నా ఆరోగ్యరీత్యా ఒక్క కూతురితోనే సరిపెట్టకున్నాం.
* అసలు మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది?
– ‘జీవనజ్యోతి’ సినిమా టైంలో. అప్పడు నావయసు 15 . ఆ సినిమాలో నేను హీరోయిన్. నారాయణరావుకు హీరోగా అది తొలి సినిమా. రాజాగారే ఈ సినిమా ద్వారా ఆయనను పరిచయం చేశారు. రాజావారికీ నాకూ వయసులో చాలా తేడా ఉంటుంది. నాకన్నా 20 ఏళ్లకు పైనే ఆయన పెద్ద.
* మీ సినిమా జీవితం ఎలా ప్రారంభమైంది?
– ‘సతీ అనసూయ’ సినిమాని సి. పుల్లయ్యతో తీశారు. అందులో నేనే హీరోయిన్. నావయసు 12 కూడా ఉండదు. అందరూ బాల నటులే. ఈ అవకాశం రేలంగి వెంకట్రామయ్య ద్వారా వచ్చింది. ఆయన ప్రొడక్షన్ లో చిన్పపుడే నేను నాటకాలు వేశాను. ‘రామదాసు’ అనే నాటికలో కమల పాత్ర వేశాను. రాజమండ్రిలో ఆ ప్రదర్శనను సి. పుల్లయ్యగారు చూశారు. రేలంగి ద్వారా నన్ను మద్రాసు పిలిపించుకుని అనసూయ వేషం ఇచ్చారు. మద్రాసు వచ్చాక స్టూడియోలోనే ఉండేవాళ్లం. 13వ ఏటనే హీరోయిన్ ని అయ్యాను. రాజావారి జయా ఫిలింస్ నిర్మించిన ‘భోజకాళిదాసు ’ సినిమాలో కన్నాంబ హీరోయిన్. నేను సెకండ్ హీరోయిన్. ఆ తర్వాత ‘కచదేవయాని’లో హీరోయిన్ గా చేశా. నా నట జీవితమంతా జయాఫిలింస్ కే పరిమితమైంది. పెళ్లి తర్వాత రాజాగారు సినిమాలు చేయవద్దన్నారు గానీ మా సినిమాల్లో చేయడానికి అభ్యంతరం పెట్టలేదు.
* మహానటి సావిత్రితో మీకు పెద్దగా అనుబంధం లేదనుకుంటా?
– లేకేం.. కలిసి సినిమాలు చేయకపోయినా అన్యోన్యంగా ఉండేవాళ్లం. భోళా మనిషి. ఎలా బతకాలో తెలియదు. తన భోళాతనం వల్ల ఇబ్బంది పడింది. శివాజీ గణేశన్ తో చేసిన ‘సరస్వతీ శపథం’ సినిమాని మేం తెలుగులోకి డబ్ చేశాం. అందులో సావిత్రి తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పింది. మేం డబ్బులు ఇవ్వబోయినా తీసుకోలేదు.
* సినిమా నటులంతా తమ చివరి దశలో ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు?
– జాగ్రత్త లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అంతెందుకు నాగయ్య కూడా ఇబ్బందులు పడ్డవారే. ఎంతో డబ్బు సంపాదించినా ఆయన నిలుపుకోలేకపోయారు. ఆడవారికే కాదు మగవారికీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి.
* ఆర్థికంగా మీరు ఎలా స్థిరపడగలిగారు?
– మాకు ఎలాంటి లోటూ రాకుండా రాజావారు ఏర్పాట్లు బాగా చేశారు. 1974లో ఆయన చనిపోయినా మేం ఇబ్బందేమీ పడలేదు. మా అమ్మాయి అనురాధాదేవి నిర్మాతగా ఎన్నోమంచి సినిమాలు తీసింది. కాకపోతే మా ఆస్తులు కొన్నిటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పటికీ ఆ కేసులు కోర్టుల్లోనే నలుగుతున్నాయి. గన్నవరం విమానాశ్రయానికి ఇచ్చిన భూమి మావారిదే. అందుకే దానికి ఆయన పేరు పెట్టారు.
Must Read ;- గయ్యాళి అత్త .. అమాయకపు అమ్మ (సూర్యకాంతం వర్ధంతి ప్రత్యేకం)
* మనదేశంలో సినిమాలో ఎన్టీఆర్ పలికిన తొలిడైలాగ్ గుర్తుందా?
– లేదండీ… కాకపోతే ఆ సినిమాలో ఆయన పలికిన ఓ డైలాగ్ బాగా పాపులర్ అయింది. ‘ఇంతవాణ్ణి అంతవాణ్ణి అయ్యాను’ అనే డైలాగ్ ఏదో ఉంది. ఆ ప్రకారమే ఆ తర్వాత జరగడంతో ఈ డైలాగ్ అంత ప్రాముఖ్యం ఏర్పడింది.
* ఈ సినిమాకి ఆయన రెమ్యూనరేషన్ ఎంత?
– సరిగా గుర్తులేదు. అడ్వాన్స్ రెండొందల యాభై అనుకుంటాను. చెక్కు రాసి ఎల్వీ ప్రసాద్ కు ఇచ్చాను. ఎల్వీ ప్రసాద్ ఆ చెక్కును ఆయనకు ఇవ్వబోతే నన్ను చూసి ‘వారి చేతుల మీదుగానే ఇప్పించండి’ అన్నారు. మొదటి చెక్కు కదా.. అది అందుకున్న ఆనందం ఆయన కళ్లలో కనిపించింది. ఆయన అంత పెద్దనటుడు అవుతాడని మేం ఊహించలేదు. మొత్తం ఈ సినిమాకు ఆయనకు రెమ్యూనరేషన్ గా రెండువేలు ఇచ్చినట్లు గుర్తు.
* ‘మనదేశం’ సినిమా ఎంత సక్సెస్ అయ్యింది?
– అంతపెద్ద హిట్ కాదుగానీ నష్టాలు మాత్రం రాలేదు. కాకపోతే నిర్మాణ వ్యయం పెరిగిపోవడం వల్ల పెద్దగా మిగల్లేదు. ‘పల్లెటూరి పిల్ల’ మాత్రం పెద్ద హిట్ అయింది. ఎన్టీఆర్ ను హీరోగా పరిచయం చేసింది కూడా మేమే. బీఏ సుబ్బారావు ద్వారా ఆ సినిమా మేమే తీయించాము.
* 97 ఏళ్ల వయసులోనూ మీరు ఎంతో ఆరోగ్యం ఉన్నారు.. ఆ రహస్యం ఏమిటి?
– నేను ప్రత్యేకంగా ఆరోగ్యసూత్రాలేమీ పాటించను. ఉదయపు నడక వదల వద్దని అక్కినేని నాగేశ్వరరావుగారు అంటుండేవారు. నాన్ వెజ్ కూడా బాగానే తింటాను. ఇప్పుడు నాకు 97ఏళ్లు. నా పనులు నేనే చేసుకుంటాను.
* ఏమేం అవార్డులు వచ్చాయి?
– మావారికి ఈ అవార్డుల మీద అంత నమ్మకం లేదు. నాకు రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చింది.
* ‘మనదేశం’ సినిమా తీయాలన్న ఆలోచన ఎందుకొచ్చింది?
– నేను కాంగ్రెస్ పార్టీ అభిమానురాలిని. నాలో దేశభక్తి బీజాలు ఉన్నాయి. అందుకే అలాంటి సినిమా తీయాలనుకున్నా. మావారు జస్టిస్ పార్టీ. మీకు తెలిసిందే కదా జస్టిస్ పార్టీ బ్రిటీషువారికి అనుకూలంగా ఉంటుంది. మావారికి ఇష్టం లేకపోయినా ఆ సినిమా చేశాను. నిజానికి మా వారిని వ్యతిరేకించి ఆ సినిమా తీశాను.
* స్వాతంత్రం రాకముందు జరిగే కథాంశంతో సినిమా ఎంచుకున్నారు. విడుదల స్వాతంత్రం వచ్చాక జరిగింది. ఎంచుకున్న కథే అలాంటిదా? లేదా సినిమా షూటింగ్ స్వాతంత్ర్యం రాకముందు జరిపారా?
– లేదు సినిమాని స్వాతంత్ర్యం రాకముందే ప్రారంభించాం. కానీ పూర్తికావడానికి చాలాకాలం పట్టింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. విడుదల ఆలస్యం కావడం వల్ల చిత్రనిర్మాణ ఖర్చు కూడా బాగా పెరిగింది. ‘విప్రదాస్’ అనే బెంగాలీ నవల ఆధారంగా ఈ సినిమా తీశాం.
* తెలుగులో సినిమాగా వచ్చిన తొలి బెంగాలీ నవల ఇదేనని చెబుతారు. ఈ నవల మీ దృష్టిలో ఎలా పడింది?
– అప్పట్లో నేను పుస్తకాలు ఎక్కువగా చదివేదాన్ని. ముఖ్యంగా బెంగాలి రచయిత శరత్ బాబు అన్నా నాకు అభిమానం. అలా ఈ సినిమా కథని ఎంచుకున్నాం. తెలుగులో సినిమాగా వచ్చిన మొదటి బెంగాలీ నవల ఇదే అవుతుంది. అసలు ‘దేవదాసు’ సినిమా కూడా మేమే చేయాలనుకున్నాం. ఈలోగా వచ్చేసింది.
* ఆ సినిమాకు హీరో నారాయణరావుకు ఇచ్చిన రెమ్యూనరేషన్ ఎంత? నాగయ్య కు ఇచ్చిన దెంత?
– సరిగా గుర్తులేదు. నాగయ్య పెద్ద హీరో కాబట్టి 40 వేలు దాకా ఇచ్చి ఉంటాను. నారాయణరావుకు 15వేల నుంచి 20 వేల మధ్యలో ఉండొచ్చు. అప్పట్లో నాగయ్య పారితోషికం చాలా ఎక్కువ ఉండేది. ‘చక్రధారి ’ సినిమాకి ఆయనకు 90 వేలు ఇచ్చాం. అప్పట్లో అదే హయ్యస్ట్ రెమ్యూనరేషన్.
* సమర్పకురాలు కావాలన్న ఆలోచన ఎవరిది? మీదా, రాజావారిదా?
– నాదే.. ఆయన వద్దన్నా ఈ సినిమా తీశాను.
* మీరు నిర్మాతగా తొలిచిత్రం ఏది?
– ‘మనదేశం’తోనే నిర్మాతగా మారాను. పుస్తకాలు ఎక్కువగా చదవడంవల్ల కథల మీద నాకు పట్టుండేది. వరసగా ఐదు సినిమాలు తీశాను. హీరోయిన్ గా నేను నటించిన సినిమాల్లో నా పాత్రకు నేనే పాటలు పాడేదాన్ని. ‘కీలుగుర్రం’ సినిమాతో అంజలీ దేవిని హీరోయిన్ ని చేశాం. మొదట ఆమె ఆ పాత్ర చేయడానికి ఇష్టపడలేదు. రాత్రపూట రాక్షసిగా మారే పాత్ర కాబట్టి వద్దని అంది. మేం నచ్చచెప్పి ఒప్పించాం. ఇందులో కూడా ఆమెకు నేనే పాడాను. నేను పాట పాడితేనే చేస్తానంది.
* మీ సినిమాల్లో కొత్తవారికి చాలామందికి అవకాశాలు కల్పించారు. ఈ ఆలోచన ఎందుకొచ్చింది?
– మేం మొదటి నుంచి అలా చేస్తూనే ఉన్నాం. అంజలీదేవి, జూనియర్ శ్రీరంజని, సూర్యకాంతం, ఎస్వీరంగారావు… ఇలా చెప్పుకుంటూపోతే చాలామందే వస్తారు. అసలు ఎస్వీరంగారావు నటుడిగా పనికిరాడని ‘వరూధిని’అనే సినిమా నుంచి తొలగించారు. ఆ సినిమాలో ఆయన ప్రవరాఖ్యుడి వేషం వేశారు. అసలు ఆ సినిమా ఆడనుకూడా ఆడలేదు. విషయం తెలిసి ఆయనను పిలిపించి ‘మనదేశం’ సినిమాలో అవకాశం ఇచ్చి ప్రోత్సహించాం. ఎం.ఆర్.ఎ. ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తీశాం. ఎం.ఆర్.ఎ. అంటే మేకా రాజ్యలక్ష్మ్మీఅనూరాధ. మా అమ్మాయి పేరు మీద ఈ సినిమా తీశాం. ఆ తర్వాత ఈ బ్యానర్ పై సినిమాలు తీయలేదు.
* ఎన్టీఆర్ మీ దృష్టిలో ఎలా పడ్డారు?
– మా సినిమా దర్శకుడు ఎల్వీప్రసాద్ తీసుకొచ్చారు. నేను ఆఫీసుకు వచ్చేసరికి వారిద్దరూ కూర్చుని ఉన్నారు. ఇన్ స్పెక్టర్ పాత్రకు ఈయనను అనుకుంటున్నాను అన్నారు. సరేనన్నాను. అడ్వాన్స్ గా మూడొందల రూపాయలు ఇచ్చాము. ఈ సినిమాకి ఎల్వీప్రసాద్ కు ఇచ్చింది 15వేలు అని గుర్తు. ఈ డబ్బుతోనే మద్రాస్ గాంధీనగర్ లో ఆయన ఇల్లు కొన్నారు.
* ఎన్టీఆర్ పెద్ద నటుడు అవుతాడని అప్పుడు మీరెవరైనా ఊహించారా?
– లేదు.. కాకపోతే ఆయనను చూడగానే బాగున్నాడని అనుకున్నాం. అలాగే ఆయనకు హీరోగా కూడా మేమే అవకాశమిచ్చాం. అది ‘పల్లెటూరి పిల్ల’ సినిమా. ఆయన రెండో సినిమా అదే.
* ఈ సినిమా నిర్మించింది బీఏ సుబ్బారావు కదా?
– లేదు మాదే.. ఆయన పేరుతో రాజాగారే నిర్మించారు. బీఏ సుబ్బారావు మా ప్రొడక్షన్ మేనేజర్. మా స్టూడియో వ్యవహారాలు కూడా ఆయనే చూసేవారు. ఇందులో అక్కినేని నాగేశ్వరావుగారు నటించినా మెయిన్ హీరో ఎన్టీఆరే.
* ఆ రోజుల్లో పారితోషికాలు ఉండేవా? జీతాలు ఉండేవా?
– జీతాలే ఉండేవి. మా స్టూడియో తరపున మేం నెలకు 49 వేల రూపాయలదాకా జీతాల రూపంలో చెల్లించేవాళ్లం. అప్పట్లో అది చాలా పెద్దమొత్తం.
* మీ అమ్మాయి కూడా నిర్మాతే కదా?
– అవును.. రాజ్యలక్ష్మీ అనూరాధాదేవి నిర్మాతగా చాలా మంచి సినిమాలు తీసింది. అక్కినేని నాగేశ్వరరావుతో‘శ్రీవారి ముచ్చట్లు’, ‘రావణుడే రాముడైతే’, ‘రాముడు కాదు కృష్ణుడు’, ‘దాంపత్యం’, ‘చక్రధారి’… ఇలా చాలా తీసింది. రాజావారికి జాతకాలంటే విపరీతమైన నమ్మకం. నాకు అంతగా నమ్మకం లేదు. ఓ జ్యోతిష్కుడు రాజావారిని కలిసి మీకు పుట్టబోయే కూతురి పేరు శ్రీకృష్ణుడి భార్యలలో ఒకరిదై ఉంటుంది అన్నారట. మొత్తానికి ఆ జ్యోతిష్కుడికి కానుకగా పులిచర్మాన్ని ఇచ్చేశారు రాజావారు. అయినా శ్రీకృష్ణుడికి ఉన్న 16వేల మంది భార్యలలో ఒక పేరు ఉండటం పెద్ద విశేషం కాదని నాకు అనిపించింది.
-హేమసుందర్ పామర్తి