Blitz Of Daniel Shekar From Rana And Pawan Kalyan’s Bheemla Nayak Released :
మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానాలతో ‘భీమ్లానాయక్’గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవర్ స్టార్ కు ధీటుగా రానా పాత్ర కూడా ఉండబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పవర్ స్టార్ ను భీమ్లానాయక్ గా జనానికి పరిచయం చేశారు. మరి రానా పాత్ర పేరు ఏమిటి అన్న సస్పెన్స్ వీడిపోయింది. ఇందులో రానా పాత్ర డేనియల్ శేఖర్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది.
ఓ పోలీసు అధికారికీ, ఓ సినిమా హీరోకీ మధ్య ఈగో క్లాషెస్ వల్ల ఎలాంటి పరిణామాలు తలెత్తాయన్నదే ఈ చిత్ర కథ. దీనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హస్తం కూడా తోడైంది. ఆయన దీనికి మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. బ్లిట్జ్ ఆఫ్ డేనియల్ శేఖర్ పేరుతో ఓ వీడియోను ఈరోజు సాయంత్రం విడుదల చేశారు. డానియల్ శేఖర్ పరిచయ సన్నివేశం ఇది. ఇంతకుముందు ‘రేయ్ డానే నాకొడకా..’ అంటూ పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఊగిపోయి రౌడీలను చితక్కొట్టే సన్నివేశాన్ని విడుదల చేశారు.
దానికి డేనియల్ శేఖర్ ఎలాంటి సమాధానం చెబుతాడో అన్నట్టుగా ఈరోజు వీడియో ఉంది. ‘నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట.. స్టేషన్ లో టాక్ నడుస్తోంది.. నేనెవరో తెలుసా?.. ధర్మేంధ్ర.. హీరో..’అంటూ తనదైన మాడ్యులేషన్ తో రానా పలికే డైలాగ్ తో ఈ బ్లిట్జ్ ఉంది. ఈ సంక్రాంతికి ఇది మసాలా చిత్రమే అని చెప్పాలి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎస్.థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. పవర్ స్టార్ అభిమానుల్లో జోష్ నింపేలా ఈ సినిమా ఉండబోతుందన్నది స్పష్టమవుతోంది.
Must Read ;- శ్రీశ్రీ మహాప్రస్థానంపై త్రివిక్రమ్ చేతికి పవర్ స్టార్ పుస్తకం