What Is The Link Between The Taliban And Tadepalli Dhulipalla Narendra Kumar :
తాలిబాన్ల చెరలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్తాన్ నుంచి వేల కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలు ఏపీలోని విజయవాడకు రవాణా అవుతున్న దందా ఇప్పుడు పొలిటికల్ రంగు పులుముకుంది. ఏపీలో క్రమంగా నేరాలు పెరుగుతున్న వైనంపై ఇప్పటికే విపక్ష టీడీపీ తనదైన శైలి ఆరోపణలు గుప్పిస్తోంది. దళిత యువతులపై వరుసగా చోటుచేసుకుంటున్న అఘాయిత్యాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనదైన శైలి పోరాటాన్ని మొదలెట్టారు. ఈ పోరుతో జగన్ సర్కారు నిజంగానే డిఫెన్స్ లో పడిపోయింది. ఇలాంటి క్రమంలో ఏపీలో నేరాలు పెరుగుతున్నాయని, ఈ ఏడాది ఏకంగా 38 శాతం మేర నేరాలు అధికంగా నమోదయ్యాయని కేంద్ర గణాంకాలు వెల్లడించాయి. దీనిపైనా టీడీపీ ఓ రేంజిలో విమర్శలు గుప్పిస్తోంది. ఇలాంటి తరుణంలో విజయవాడ కేంద్రంగా వేల కోట్ల డ్రగ్స్ దందా వెలుగు చూసిన నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బిగ్ బాస్ ఎవరు?
విజయవాడ కేంద్రంగా డ్రగ్స్ దందా వెలుగు చూడటంతో ఏపీలో పెను కలకలం రేగింది. దీనిపై విపక్ష టీడీపీ కూడా తనదైన రీతిలో స్పందించింది. ఇందులో భాగంగా టీడీపీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్.. జగన్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ‘‘ఏపీని డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మార్చారు. ఆఫ్ఘన్ నుంచి విజయవాడకు డ్రగ్స్ వస్తున్నాయి. రూ.9 కోట్ల విలువైన డ్రగ్స్ ఆశి ట్రేడింగ్‌కు వచ్చాయి. తాలిబాన్ టూ తాడేపల్లికి ఉన్న సంబంధమేమిటో తేల్చాలి. ఈ దందాలో బిగ్ బాస్ ఎవరో తేలాలి’’ అంటూ ధూళిపాళ్ల ఘాటు కామెంట్లు చేశారు. ఇటీవలికాలంలో తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయం సమీపంలోనే పలు నేరాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తాడేపల్లి పరిధిలో, జగన్ ప్యాలెస్ కు కూతవేటు దూరంలోనే మొన్నామధ్య ఓ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి విషయాలన్నింటినీ గుర్తు చేస్తూనే.. ధూళిపాళ్ల డ్రగ్స్ దందాపైనా ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వైసీపీ ఎలా స్పందిస్తుందో..?
డ్రగ్స్ దందాను కేంద్రంగా చేసుకుని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఈ దందాను పట్టుకున్న డీఆర్ఐ ఈ కేసును ఇంకా లోతుగా దర్యాప్తు సాగిస్తున్న క్రమంలో విజయవాడలోని ఆశి ట్రేడింగ్ కంపెనీకి జూన్ లో ఏకంగా రూ.72 వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ వచ్చాయని, ఇప్పుడు రూ.9 వేల కోట్ల విలువైన డ్రగ్స్ వస్తూ గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పట్టుబడ్డాయని తేలింది. ఇవి కాకుండా ఆశి ట్రేడింగ్ కు ఇంకా భారీ మొత్తంలోనే డ్రగ్స్ వచ్చి ఉంటాయన్న వాదనలతో డీఆర్ఐ దేశవ్యాప్తంగా ఈ నెట్ వర్క్ ను చేధించేందుకు యత్నిస్తోంది. ఇలాంటి క్రమంలో ఈ డ్రగ్స్ దందాపై జగన్ సర్కారు ఇప్పటికైతే ఎలాంటి స్పందన తెలపలేదు. అయితే తాలిబాన్ టూ తాడేపల్లి లింకేమిటో చెప్పాంటూ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చేసిన వ్యాఖ్యలపై మాత్రం వైసీపీ తప్పనిసరిగా స్పందిస్తుందన్న వాదన వినిపిస్తోంది.











