నెల్లూరులో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటనలో ఆ పార్టీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. రప్పా..రప్పా నినాదాలతో మరోసారి రచ్చ చేశారు ఫ్యాన్ పార్టీ అభిమానులు. వైసీపీ అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ ఆడాలి అంటూ నినాదాలు చేస్తూ స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు. జగన్ వచ్చిన వెంటనే గోడలు దూకి హెలిప్యాడ్ దగ్గరకు దూసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. లేకపోతే పరిస్థితి మరింత ఉద్రిక్తతలకు దారి తీసేదని చెబుతున్నారు.
వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే వైసీపీ కార్యకర్తలు ఏ స్థాయిలో సైకోల్లా తయారయ్యారో స్పష్టమవుతోంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ ఆడాలి అని బహిరంగంగా కోరుకునే మానసిక స్థితిని ఏమనాలి.? ఇది అత్యుత్సాహం ఏ మాత్రం కాదు, వారిలో జీర్ణించుకుపోయిన హింసాత్మక ప్రవృత్తికి నిదర్శనం. జగన్ కేవలం ఓ పెళ్లికి వచ్చి, వెంటనే బెంగళూరు వెళ్లిపోయినా, ఇక్కడ మాత్రం ఆయన అనుచరులు ఉన్మాదపు ఆలోచనలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం వైసీపీ ఆలోచనా తీరుకు అద్దం పడుతోంది.
వైసీపీ శ్రేణులు బరితెగించడం ఇదే తొలిసారి కాదు, గత ఐదేళ్ల పాలన అంతా విధ్వంసాలకు, దాడులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. నాడు ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం, ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు దిగడం, సోషల్ మీడియా వేదికగా మహిళలని కూడా చూడకుండా అసభ్యకరమైన దాడులు చేయడం రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. పాలకుల అండ చూసుకుని అప్పట్లో రెచ్చిపోయిన ఆ పార్టీ శ్రేణులు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా సరే అదే సైకో మనస్తత్వంతో వ్యవహరిస్తూ, తమకు చట్టాలన్నా, వ్యవస్థలన్నా గౌరవం లేదని నిరూపించుకున్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల హృదయాలను గెలుచుకుని అధికారంలోకి రావాలి కానీ, ఇలా రక్తం పారించాలని చూడటం అనాగరిక చర్య. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్‌లో వైసీపీ శ్రేణులు చేస్తున్న ఈ వీరంగాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రక్తపాతాలు, కక్ష సాధింపులు కోరుకునే ఇలాంటి హింసాత్మక రాజకీయాలను సమాజం ఎప్పటికీ హర్షించదు.











