వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆస్తుల పంపకాలపై ఆయన సతీమణి విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని.. ఇంత వరకు షర్మిలకు ఆస్తులు పంచలేదని స్పష్టం చేశారు. ఆస్తుల పంపకాల గురించి వైసీపీ నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ వినిపిస్తున్న వాదనకు.. విజయమ్మ కౌంటర్ ఇచ్చారు. అఫిడవిట్ ద్వారా మీడియాకు వివరణ ఇచ్చారు.
తన ఆస్తులను నలుగురు మనవలు, మనవరాళ్లకు సమానంగా పంచాలనేది వైఎస్సార్ ఉద్దేశం. అది ఆయన ఆదేశం కూడా. వైఎస్ కుటుంబానికి దగ్గరి వాళ్లందరికీ తెలసిన వాస్తవమిది. ఎంవోయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి అమెకు దక్కాల్సిందేనని… వాస్తవానికి షర్మిలకు న్యాయంగా రావాల్సిన దానికంటే తక్కువే రాశారని విజయమ్మ తెలిపారు. ప్రస్తుతం సరస్వతి సిమెంట్ కంపెనీ ఆస్తుల వ్యవహారంలో వివాదం నడుస్తోంది. అయితే బెంగళూరు యలహంక ప్యాలెస్ కూడా షర్మిలదేనని బాంబు పేల్చారు. ఇప్పటి వరకు షర్మిలకు ఇచ్చానని చెబుతున్న డబ్బంతా.. ఆస్తుల మీద వచ్చిన ఆదాయంలో ఆమె వాటా మాత్రమేనని తేల్చి చెప్పారు. జగన్ ఇప్పటి వరకు తన మేనల్లుడు, మేనకొడలికి అన్యాయం చేశాడని.. ఇప్పటికైనా న్యాయం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నట్లు తెలిపారు. నిజం ఏమిటో దేవుడికి, నా కొడుక్కి కూడా తెలుసు.. దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే అని అఫిడవిట్ ద్వారా విజయమ్మ తెలియజేశారు.
వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత మీద.. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ షర్మిల చేసిన కామెంట్స్ వైసీపీని షేక్ చేశాయి. జగన్‌లాంటి అన్న ఉంటే శతృవులు అవసరం లేదని చెప్పడం.. సంచలనం సృష్టించింది. ఆ దెబ్బతో ఫ్యాన్ పార్టీ నేతలంతా షర్మిల వ్యాఖ్యలను కౌంటర్ చేస్తూ.. మాట్లాడారు. పనిలో పనిగా జగన్ ఆస్తిలో షర్మిలకు వాటా రాదని చెప్పేశారు. ఈ వ్యాఖ్యలను తిప్పికొడుతూ విజయమ్మ అఫిడవిట్ విడుదల చేయడం జగన్‌కి షాక్ కొట్టే పరిణామమే. మరి ఇప్పుడు వైసీపీ నాయకులు.. ఆ పార్టీ సోషల్ మీడియా సైన్యం.. జగన్ తల్లి మీద కూడా ఎదురుదాడి చేస్తారా.. లేక ఆమె చెప్పిందే నిజమేనని ఒప్పుకొంటారో చూడాలి.











