Cats Also Attack On Human Beings :
పిల్లులు కూడ మనుషులపై దాడి చేస్తాయి. వాటి దాడిలో శరీరంపై చిన్న గాట్లు పడినా యాంటీ రబీస్ వ్యాక్సిన్ తీసుకోవడం శ్రేయస్కరమని కేరళలో జరిగిన సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. పెంచుకుంటున్న ఓ పిల్లికి పిచ్చెక్కి అర్థరాత్రి 8 మందిపై దాడి చేసింది. విజయనగరం జిల్లా కొమరాడ మండలం దలైపేట గ్రామంలో జరిగిన ఈ ఘటనలో గాయపడిన ఎనిమిది మందిలో ఏడుగురు సమీప ఆస్పత్రిలో చికిత్స పొందగా ఒకరు చినమెరింగి పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు 8 మందిపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచిన పిల్లి ఆ తర్వాత కనిపించకుండా పోయింది. భయంతోగాని లేక అడవిలోని విషపూరితమైన ఏదైనా పండుగాని తిన్న పిల్లి ఈ విధంగా దాడి చేసినట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై అటవీశాఖ అధికారులను అప్రమత్తం చేసినట్లు పోలీసులు తెలిపారు.
కేరళలో కుక్కల కంటే పిల్లులే డేంజర్!
కేరళలో కుక్కల కంటే పిల్లుల కాట్లకే ఎక్కువ మంది గురవడం విశేషం. రాష్ట్ర యానిమల్ ఫోర్సు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు ఆరోగ్యశాఖ ఇచ్చిన వివరాలు విస్తుగొల్పుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో కేరళలో 20,875 మందిని కుక్కలు కరవగా 28,186 మందిపై పిల్లులు దాడి చేశాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కుక్కల కంటే పిల్లుల దాడికి గురైనవారే ఎక్కువ మంది చికిత్స పొందినట్లు కూడ ఆరోగ్య శాఖ పేర్కొంది. 2014 నుంచి 2020 వరకు పిల్లుల దాడికి గురైన వారు 128 శాతం పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఐదుగురికి రబీస్ వ్యాధి
పిల్లుల దాడికి గురైన వారిలో ఐదుగురికి రబీస్ వ్యాధి సోకినట్లు, వారిలో ఒకరు మృతి చెందినట్లు యానిమల్ లీగల్ ఫోర్స్ జనరల్ సెక్రటరీ యాంజిల్స్ నాయర్ తెలిపారు. జంతువుల దాడిని తేలిగ్గా తీసుకోవడమే దీనికి కారణమన్నారు. సాధారణంగా పిల్లులు పళ్లు, గోళ్లతో రక్కటంతో మనుషుల శరీరాలపై గాట్లు పడతాయన్నారు. వాటి దాడిలో చిన్న గాయమైనా యాంటీ రబీస్ వ్యాక్సిన్ తీసుకోవడం శ్రేయస్కరమని ఆయన తెలిపారు.