Bridge Pillar Fell on Car :
విశాఖ జిల్లాలోని అనకాపల్లి వద్ద జాతీయ రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పిల్లరు కూలి రెండు వాహనాలపై పడటంతో ఇద్దరు మృతి చెందారు. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అనకాపల్లి శంకర్‌మఠ్ కూడలి వద్ద ఇంటర్‌ఛేంజ్ రహదారి నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్మాణంలో బ్రిడ్జి సైడ్ పిల్లర్ కూలి రహదారిపై వెళ్తున్న వాహనాలపై పడింది. ఈ ప్రమాదంలో కారు, ఆయిల్ ట్యాంకర్ ధ్వంసమయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ట్యాంకర్‌లో ఉన్న వారికి గాయాలవడంతో వారిని అనకాపల్లిలోని ఆసుపత్రికి తరలించారు. బ్రిడ్జి పిల్లర్లు పెద్ద శబ్ధంతో కూలడంతో జనం పరుగులు తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బ్రిడ్జి కింద ఇంకెవరైనా చిక్కుకున్నారేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నూకాలమ్మ దర్శనానికి వచ్చి వెళుతుండగా..
నూకాలమ్మ దర్శనానికి కారులో వచ్చి తిరిగి వెళ్తున్న వారు ఈ ప్రమాదానికి గురయ్యారని పోలీసులు తెలిపారు. వంతెన పిల్లర్ కారుపై పడటంతో పూర్తిగా నుజ్జునుజ్జయింది. చీకటి పడటంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. వంతెన సైడ్ పిల్లర్ ఒక్కసారిగా కూలిపోవడంతో వంతెన నిర్మాణంలో నాణ్యతపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక టీడీపీ నాయకులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితులను తెలుసుకున్నారు.










