వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ రంకెలు వేయడం తప్ప జిల్లాల్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. చాలా చోట్ల వైసీపీ నేతలు ఒకరినొకరు వెన్నుపోటు పొడుచుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లా పార్టీలో ఉన్న విభేదాలు సర్ది చెప్పేందుకు ఎవరైనా ఉన్నారా అంటే అదీ కనిపించడం లేదు.
పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డే తన నాయకులను తొక్కేస్తున్నారు. అప్పటి వరకూ ఎంతో హూందాగా రాజకీయ జీవితం గడిపిన వారిని జగన్ రెడ్డి తన రాజకీయ అపరపక్వతతో చిన్న చూపు చూసి వారి పరువు తీస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక వెలుగు వెలిగిన వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా మారింది.
ఆయనను జగన్ రెడ్డి వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేస్తున్నారు. తాజాగా ఆయన అనుచరుల్ని పార్టీ నుంచి గెంటేశారు. బాలినేని ముఖ్య అనుచరులైన భవనం శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసింది. వీరిద్దరూ పర్చూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. బాలినేనికి సమాచారం ఇవ్వకుండానే వీరిని సస్పెండ్ చేశారు.
ఈ చర్యలపై బాలినేని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే ఎలా సస్పెండ్ చేస్తారని ఆయన పార్టీ నేతలపై మండిపడ్డారు. 48 గంటల్లో తన అనుచరులను మళ్లీ పార్టీలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ను కలిసి ఈ అంశంపై బాలినేని చర్చించే అవకాశం ఉందని చెపుతున్నారు.
అయితే ముఖ్యమంత్రికి తెలియకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోరని.. అంతా జగన్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని చెబుతున్నారు. ప్రకాశం జిల్లాపై బాలినేని ప్రభావం ఏమీ ఉండదని చెప్పేందుకు ఈ సంకేతాలు పంపారని అంటున్నారు.
ఇటీవల విజయసాయిరెడ్డి ఈ జిల్లాకు ఇంచార్జ్ గా వచ్చారు. ఆ సమయంలో బాలినేనికే ప్రాధాన్యం ఇచ్చారు. ఆయనే జిల్లాను చూసుకోవాలన్నట్లుగా మాట్లాడారు. కానీ జరుగుతోంది మాత్రం రివర్స్‌లో . ఈ కారణంగా బాలినేనిలో అసంతృప్తి పెరిగిపోతోంది. ఇప్పటికే ఆయనకు గేటు చూపించారని… అయితే బాలినేని ఇంకా గేటును పట్టుకుని వేలాడుతున్నారని ఆయన అనుచరులు సెటైర్లు వేసుకుంటున్నారు.