(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రామతీర్థం ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ సంఘటనపై తక్షణమే నివేదిక అందజేయాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. హిందూ ఆలయాలపై వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ.. పోలీసు వైఫల్యమే సర్వత్రా కనిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న సాంకేతికత అందుబాటును బట్టి చిన్న నేరం జరిగినా సరే.. చిటికెలో దాన్ని ఛేదించగలుగుతున్న పోలీసు యంత్రాంగం.. ఒకవైపు హిందూ ఆలయాలపై వరుస దాడులు జరుగుతూనే ఉన్నప్పటికీ.. స్పందిస్తున్న తీరు ప్రజల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం సీరియస్ అయినట్లు డీజీపీని నివేదిక కోరినట్లు తెలుస్తోంది.
గతంలో అంతర్వేది రథం దగ్ధం అయినప్పుడు.. డీజీపీ రాష్ట్రంలోని అందరు ఎస్పీలతో పోలీసు ఉన్నతాధికార్లతో సమావేశం నిర్వహించి.. ఆలయాలపై దాడుల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో సుదీర్ఘంగా చర్చించారు. నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఆ నిర్ణయాలు ఏమయ్యాయో తెలీకపోగా.. ఒక ఆలయంలో ఒక దుర్ఘటన జరిగినప్పుడు.. ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్లిన ఒక పార్టీ వారికి ఒక విధమైన మర్యాదలు – ఏర్పాట్లు, ఇతర పార్టీలకు మరో విధమైన నియంత్రణలు విధించడం కూడా కేంద్ర ఇటువైపు, పోలీసు ఫెయిల్యూర్ వైపు దృష్టి సారించడానికి ఒక కారణం అని పలువురు భావిస్తున్నారు.
తాజాగా శనివారం నాటి ఎపిసోడ్ లో కూడా.. బీజేపీ నాయకులు రామతీర్థం వద్ద నిరసనలకు పూనుకున్నప్పుడు.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీజేపీ నాయకురాలు స్పృహ కోల్పోవడం కూడా జరిగింది. ఈ వ్యవహారాలన్నీ కూడా కేంద్రం సీరియస్ కావడానికి దారితీశాయని తెలుస్తోంది.
Also Read: రంగంలోకి యోగి : రామతీర్థంపై కేంద్ర బీజేపీ సీరియస్