రామతీర్థం కోదండరామాలయంలో రాముని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన దుర్ఘటనను కేంద్ర బీజేపీ సీరియస్ గా తీసుకుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పట్టనట్టు వ్యవహరించినా కేంద్ర బీజేపీ పెద్దలు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ధాస్ ను రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల నాలుగో తేదీ అంటే సోమవారం యూపీ సీఎం రామతీర్థంలోని కోదండరామాలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం బీజేపీ, జనసేన నేతలు పెద్ద ఎత్తు నిరసన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
జనసేనాని రంగంలోకి దిగుతారా?
రామతీర్థం ఘటనపై కేంద్ర బీజేపీ తీసుకున్న మెరుపు నిర్ణయం వెనుక ఇవాళ టీడీపీ నేత చంద్రబాబునాయుడు కార్యక్రమానికి వచ్చిన భారీ స్పందనే కారణంగా తెలుస్తోంది. ప్రముఖ దేవాలయంలో సాక్షాత్తూ రాములోరి విగ్రహం తల నరికినా ఏపీ బీజేపీ నేతలు పెద్దగా స్పందించకపోవడంపై, కేంద్ర బీజేపీ అధ్యక్షుడు నడ్డా, సోముకు బాగా తలంటారనే వార్తలు వస్తున్నాయి. ఇక బీజేపీ సోమవారం చేపట్టనున్న రామతీర్థం నిరసన కార్యక్రమానికి జనసేనాని పవన్ హాజరవుతారా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
సోము వైఫల్యమా?
ఏపీలో దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నా బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విఫలం అయ్యారనే విమర్శలు సొంత పార్టీ నుంచే వ్యక్తం అవుతున్నాయి. హిందూ ముద్ర వేసుకున్న బీజేపీ, దేవాలయాలు, దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చేస్తూ ఉంటే కనీసం నిరసన తెలపకపోవడం సోము వైఫల్యంగానే భావిస్తున్నారు. సోము అధ్యక్షతన ఏపీ బీజేపీ మరింత దిగజారిపోయిందనే అంచనాలు కూడా ఉన్నాయి. సోము విఫలం చెందడం వల్లే యూపీ నుంచి యోగిని రంగంలోకి దించినట్టు తెలుస్తోంది.