తిరుపతిలో త్వరలో నిర్వహించబోయే ఉపఎన్నికల్లో బీజేపీ కూడా పోటీ చేస్తుందని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీలో వెల్లడించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలసిన అనంతరం ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దుబ్బాకలో గెలుపు ఏపీ బీజేపీలో ఉత్సాహం నింపిందని సోము ఆనందం వ్యక్తం చేశారు. తిరుపతిలో జనసేన కూడా పోటీ చేయనుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. ఏపీలో కలసి పనిచేయాలని నిర్ణయించుకున్న బీజేపీ, జనసేన పార్టీలు తిరుపతి ఉప ఎన్నికల్లో రెండు పార్టీలు అభ్యర్దులను నిలపనున్నాయి. దీంతో తిరుపతి రాజకీయాలు వేడెక్కాయి.
సోమవారం నిరసన
రామతీర్థంలోని కోదండరామాలయంలో రాముని విగ్రహ ధ్వంసాన్ని ఖండిస్తూ సోమవారం నిరసన తెలపనున్నట్టు సోము వీర్రాజు ప్రకటించారు. దేవాలయాలపై దాడులు ఆత్మాభిమానం, స్వాభిమానానికి సంబంధించిన అంశమని, ఇది రాజకీయ అంశం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దుబ్బాక విజయంతో ఊపుమేదున్న బీజేపీ నేతలు తిరుపతిలో పోటీకి ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్ధిని ప్రకటించి, వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. తిరుపతిలో గెలిచి ప్రజల్లో వ్యతిరేకత లేదని నిరూపించుకోవాలని వైసీపీ అధినేత భావిస్తున్నారు.