(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
‘దేవున్ని ఆరాధించే అందరికీ ఈ ఘటన బాధ కలిగించే ఘటన. నాకైతే ఎంతో బాధ కలుగుతోంది. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో హిందూ దేవాలయాలపై దాడులు చేయడం, రధాలు తగుల బెట్టడం చూసి ఏ హిందువు బాధ కలగకుండా ఉంటారు. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పుట్టిన నేను ఏ రోజూ దేవాలయాలపై ఇటు వంటి ఘటనలు చూడలేదు. జై శ్రీరాం అంటూ దేశమంతా మారుమ్రోగుతున్న వేళ.. ఇక్కడ శ్రీరాముని తలతీసేసారంటే ఈ ముఖ్యమంత్రి మనిషేనా.. పోలీసులు తమషాలు చేస్తున్నారు.. నా దగ్గరే తోక తిప్పుతారా .. నేను దారి వెంట వస్తే నా ముందు మీ వేషాలా.. మేమంతా తిరగ బడితే మీరెక్కడ? ఈ ఏ2 ఎందుకు వచ్చాడు ఇక్కడికి.. నేను వస్తే అడ్డుకోడానికి వస్తాడా.. మా శ్రీరాముని తల తీసే పరిస్థితికి వచ్చారంటే మాకు బాధ కలగదా?.. ఈ 19 నెలల్లో 128 దేవాలయాలపై దాడులు జరిగాయి.. మంత్రాలయంలో ఆంజనేయ స్వామి తల తీసేసారు. క్రైస్తవ మత ప్రచార చేయడం అతిగా చేస్తున్నారు.. టీటీడీలో కూడా క్రైస్తవ మత ప్రచారం మానడం లేదు.. ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా? బుద్ది ఉందా? ఇంత ఘటన జరిగితే ఇక్కడికి వచ్చాడా? సింహాచలం గోశాలలోని గోవులకి గడ్డి పెట్టక చంపే పరిస్థితి కల్పించింది ఈ ప్రభుత్వం.. ఈ జిల్లా కలెక్టర్, ఆర్డీవోకు బాధ్యత లేదా? పోలీసులారా ఖబడ్ధార్ .. మీకు కొన్ని బాధ్యతలు .. హద్దులు కూడా ఉన్నాయని గుర్తించుకోండి, మీరు పెట్టే ప్రతి కేసును మేం అధికారంలోకి వచ్చి తిరిగి విచారణ చేయించి తప్పుచేసిన పోలీసులపై చర్యలు తీసుకుంటాం. క్రైస్తవ ఆలోచనలు కలిగిన ముఖ్యమంత్రికి ఇతర మతాలను గౌరవించాల్సిన బాధ్యత ఉంది.
సీతారాముల కల్యాణం ప్రభుత్వ అధికారంగా నిర్వహించాలని ఒంటిమిట్ట, రామతీర్థం ఎంపిక చేసాం.. పూసపాటి రాజులు నిర్మించిన ఈ దేవాలయానికి విశిష్ట చరిత్ర ఉంది. అంతర్వేదిలో రధం దగ్ధం చేశారు. నెల్లూరులో వెంకటేశ్వర స్వామి దేవాలయం ధ్వంసం చేశారు. ఆంజనేయ స్వామికి చేయి నరికితే రక్తం వచ్చిందా అని ఎగతాళి గా మాట్లాడుతారు వైసీపీ నాయకులు.. తిరుపతికి సీఎం హోదాలో వెళ్లావు కాబట్టి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పినా.. దేవాలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఈ సీఎం కి లేదా?
ఒక్క పైసా ఆశించకుండా ప్రజా సేవ చేస్తున్న అశోక్ గజపతి కుటుంబం దేవాలయాల కోసం ఇచ్చిన భూములు కొట్టేయడానికి అర్ధరాత్రి జీవోలు ఇచ్చే అధికారం ఈ ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు? విజయవాడలో దుర్గమ్మ ఆలయంలో రధం పై మూడు వెండి గుర్రాలు మాయం. ఎక్కడికి పోయాడు ఈ సీఎం. నేనూ చర్చ్ కు వెళ్తాను.. వారి ఆచారం ప్రకారం వారిని గౌరవిస్తాను. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఇతర మతాలను కించ పరచకూడదు. టీటీడీలో ఆర్టీసి బస్ టికెట్ లపైన వెంకటేశ్వర స్వామి ప్రచార ప్రకటన ఉండాలి కానీ జెరూసలేం యాత్ర కోసం ప్రచారం చేస్తారా? రాజశేఖర్ రెడ్డి కూడా ఏడు కొండలు లేవని అన్నాడు.. కానీ నేను గట్టిగా ప్రతిఘటించాను. అపచారం చేయొద్దని కింది నుంచి కొండ పైకి పాదయాత్ర చేసి నిరసన తెలిపాను. శ్రీశైలంలో కూడా ఇలాగే .. రాజమండ్రి లో వినాయక విగ్రహానికి మలమూత్రాలు రుద్దడం ఎంత అపచారం.. దేవాలయ భూములన్నీ అమ్మేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ముఖ్యమైన దేవాలయాలను ఎన్టీఆర్, నేను బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ చేశాం. అమరావతి రాజధానిని ప్రజలంతా అంగీకరించ లేదా? విశాఖ, విజయనగరం జిల్లాల మధ్య ఐటీ రంగాన్ని తీసుకు రావాలని ఆలోచన చేస్తే, మీరు రాజధాని పేరిట ఇక్కడ భూములు, దేవాలయాల ఆస్తులు కొట్టేస్తారా?’ అంటూ టీడీపీ అధినేత, మాజీమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపైన ముఖ్యమంత్రిపైన విరుచుకుపడ్డారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో జరిగిన రాములోరి విగ్రహం ధ్వంసాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు శనివారం రామతీర్థం వచ్చిన ఆయన ఆలయపరిశీలన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.
దుర్మార్గుడు జగన్ : అచ్చెన్న
‘ఈ రాష్ట్రానికి భ్రష్టు పట్టి 19 నెలలవుతోంది. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. నీతికి, నిజాయితీకి నెలవైన ప్రాంతం ఇది. ఇలాంటి చోట శ్రీరామునికి అపచారం జరిగింది. ఇక్కడకు రావడానికి దొంగకి అనుమతి ఇచ్చిన పోలీస్ యంత్రాంగం, మా నాయకుడు చంద్రబాబు ను అడ్డుకోవడం దుర్మార్గపు చర్య. జగన్ క్రైస్తవ ముఖ్యమంత్రి.. చంద్రబాబు నాయుడు తిరుమల వెంకటేశ్వరస్వామి ఆశీర్వాదాలు ఉన్న భక్తుడు. రాష్ట్రంలో 124 ఘటనలు జరిగితే ఒక్క ఘటన పైన సీఎం జగన్ మాట్లాడారా? వెళ్ళారా? అని ప్రశ్నిస్తున్నాను. రామతీర్ధంలో ఘటన జరిగిన రోజు జిల్లా పర్యటనకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కనీసం ఘటన పైన స్పందించ లేకపోవడం దురదృష్టకరం. విజయ సాయిరెడ్డి కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారు. ఘటన జరిగి ఇన్ని రోజులవుతుంటే, ఈరోజు చంద్రబాబు వస్తున్నారని తెలుసుకొని అడ్డుకోవడానికి వచ్చిన దొంగ నిన్నటి రోజున లోకేష్, చంద్రబాబు పై ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు పాపం చేసారో మూడు నెలల్లో వారికి తగిన శాస్తి జరుగుతుంది. దొంగ నాయకుడు వస్తే తెర తీసి రాముడిని చూపించారు. మా నాయకుడు వస్తే తెర వేసి పోలీసులు అవమాన పరిచారు. ఖబడ్దార్ పోలీసుల్లారా జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగి అతిగా ప్రవర్తిస్తున్న మీ చిత్ర గుప్తుడి చిట్టా తయారు చేస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చాక ఒక్క సంతకంతో మీ సంగతి తేలుస్తాం’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
సాయిరెడ్డి గడ్డి పీకడానికి వచ్చాడా : కళా వెంకట్రావు
‘రెండు రోజుల క్రితం ఈ పర్యటన పెట్టుకున్నాం. అది తెలిసి విజయ సాయిరెడ్డి గడ్డి పీకడానికి వచ్చాడా? అని ఎద్దేవా చేశారు. ప్రజల తరఫున ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపడం ప్రతిపక్షం విధి. విజయ సాయిరెడ్డి అండ్ కో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేసారు. అవినీతి అక్రమాలతో ఈ ప్రభుత్వం దోచుకుంటుంది. అందుకే ఈ ప్రభుత్వాన్ని ఫేక్ ప్రభుత్వం, ఫేక్ ముఖ్యమంత్రి అని ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబు ను రానివ్వకుండా ఆటంకాలు సృష్టిస్తూ నీచమైన రాజకీయాలు చేశారు. చంద్రబాబు 18 ఏళ్ల యువకుడిలా ఇంత ఎత్తయిన కొండను సునాయాసంగా ఎక్కి, దిగడం ద్వారా దేవుని ఆశీస్సులు ఆయనపై ఉన్నారని స్పష్టం అవుతోంది’ అంటూ టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు అన్నారు.
హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి : ఎంపీ రామ్మోహన్ నాయుడు
‘రామతీర్థం ఘటన హిందువుల మనోభావాలను దెబ్బ తీసింది. వారికి అండగా చంద్రబాబు నాయుడు నిలిచారు. చంద్రబాబు రాకను అడ్డుకొని ఆయన్ని అవమానిస్తుంటే ఈ పోలీస్ లు ఎక్కడ దాక్కున్నారు’ అంటూ శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
బెయిలుపై వచ్చినవారి పాలన ఇలానే ఉంటుంది : అశోక్ గజపతి
‘రాజ్యాంగం ను గౌరవిస్తామని అధికారంలోకి వచ్చే వారు ప్రమాణం చేసి వస్తారు. రాజ్యాంగంను అమలు చేసే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది. పాక్ లాంటి దేశాల్లో హిందూ దేవాలయాలు నాశనం అయితే మన కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేస్తే .. ఆ దేశం దిగి వచ్చి హామీ ఇచ్చింది. రాష్ట్రాల్లో 120 దేవాలయాల పై దాడులు జరిగితే ప్రభుత్వ చర్యలు ఎక్కడ? విజయ సాయిరెడ్డి కి ఇక్కడి ప్రజలు చెప్పులతో స్వాగతం పలికారు. విజయసాయిరెడ్డి కి విద్వేషాలు అంటే ఇష్టం.. రాజ్యాంగం హక్కులని అమలు చేయడం, దేవాలయాలు పరిరక్షించడం ప్రభుత్వాల బాధ్యత.. శ్రీరాముడి తల తీసేయడం కాదు భక్తుల తలలు తీసేసినట్టుగా అనిపించింది. జైలు నుంచి బెయిల్ పై వచ్చే వారి పాలన ఇలాగే ఉంటుంది.. అంటూ టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి అన్నారు.
ఈ సమావేశంలో పలువురు టీడీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Also Read: రామతీర్థం పేరుతో రచ్చ : వైసీపీ vs టీడీపీ