ధరలు దిగిరావాలి.. జగన్ దిగిపోవాలి..!
నిత్యావసర సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది! పెంచిన ధరలపై ప్రజల పక్షాన టీడీపీ ఎప్పటికప్పుడు పోరాడుతూనే వస్తోంది! జగన్ రెడ్డి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలపై నిరసన గళాన్ని ఎక్కుపెట్టాలని భావించిన అధినేత చంద్రబాబు, రాష్ట్ర వ్యాప్త నిరసనలకు సోమవారం పిలుపు నిచ్చారు. రేపు ( మంగళవారం) ‘‘ ధరలు దిగిరావాలి.. జగన్ దిగిపోవాలి ’’ అంటూ.. ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గం, మండల హెడ్ క్వాటర్స్ లో నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫ్యలాలపై సమాధానం చెప్పుకోలేక వైసీపీ డిఫెన్స్ లో పడిందని, రాష్ట్రంలో విచ్చల విడి దోపిడి పెరిగిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. మైనింగ్, మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియా ద్వారా వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని, నాడు – నేడు పేరుతో చేసిన అవినీతి ప్రజలకు అర్థమైందని మండిపడ్డారు. పంచాయతీలలో జగన్ రెడ్డి భరించలేని పన్ను భారాన్ని మోపారని వివరించారు. మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే మైనింగ్ దోపిడి జరుగుతోందని, తక్షణమే మంత్రి పెద్దిరెడ్డిని బర్తరఫ్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. సోమవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.