ఏపీలో విగ్రహ విధ్వంసాలు ఆగడంలేదు. ఒకవైపు రామతీర్థ రాజకీయం రాజుకుంటుంటే.. మరోవైపు 3 విగ్రహ విధ్వంసాలతో నూతన సంవత్సరానకి స్వాగతం పలికింది ఆంధ్ర ప్రదేశ్. అధికార, ప్రతి పక్షాలు రామతీర్థ దర్శనాలతో రాజకీయ వేడి పుట్టిస్తున్న ఈ తరుణంలో మరో విగ్రహ ధ్వంసం చేసిన ఘటన కర్నూలులో వెలుగుచూసింది.
కర్నూలు జిల్లా కోసిగి మండలం మర్లబండలోని స్థానిక ఆంజనేయస్వామి గుడి గోపురంపై ఉన్న సీతారాముల విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అంతటి ఆగకుండా గుడిలోకి ప్రవేశించి ఏకంగా హుండీనే మాయం చేశారు దుండగులు. మూడురోజుల క్రితం ఘనంగా జాతర జరగడంతో భక్తులు కానుకలు సమర్పించుకున్నారు. వాటిని అపహరించాడానికే హుండీ దొంగలించి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. కానీ, హుండీతో పాటు విగ్రహాన్ని ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్రమంతటా దేవుని విగ్రహాల ధ్వంసం చేస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. హిందూ సనాతన ధర్మకర్తలు, ప్రతి పక్ష నేతలు ఈ సంఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒకేరోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు.. అధికార పక్ష నేత విజయసాయి రెడ్డి రామతీర్థ సందర్శనానికి పూనుకోవడంతో అక్కడి గుడి వాతావారణమంతా రణరంగంలా మారింది. ఇలాంటి పరిణామాల మధ్య ఇలాంటి ఇంకో సంఘటన జరగడంతో అధికారుల ప్రవర్తనపై స్థానికులు తవ్ర అసంతృప్తి తెలియజేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.