2019 నుండి 2024 వరకు.. రాజకీయ ప్రత్యర్ధులపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతలా విరుచుకుపడేవారో, తన పార్టీ నేతలతో ఏ స్థాయిలో బూతులు పలికించేవారో వీడియోలే సాక్ష్యం.. ప్రతిపక్ష పార్టీలను శత్రువులకు కంటే ఘోరంగా ట్రీట్ చేసేవారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై స్వయంగా జగన్ విరుచుకుపడేవారు.. ఒక ఫ్యాక్షనిస్ట్ నేతగా ఆయన నైజం ప్రదర్శించారనే చర్చ ఉంది.. తాజాగా, ఏపీలో పాలన మారడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది.. ప్రత్యర్ధుల గౌరవాన్ని ఎలా కాపాడాలో, వారి అభిప్రాయాలను ఎలా గౌరవించాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపించారు..
చంద్రబాబు నాయుడు మరోసారి తన ప్రజాస్వామ్య పాలనా తీరును చాటారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన వైసీపీ అధినేత జగన్ పట్ల ఉదారంగా వ్యవహరించాలని పార్టీ సభ్యులను ఆయన కోరారు. జగన్ ప్రమాణ స్వీకారం విషయంలోనూ ఔదార్యంగా వ్యవహరించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేసారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆ తర్వాత మంత్రులు, వైఎస్ జగన్, మిగతా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం అసెంబ్లీకి సంబంధించిన కొన్ని నిబంధనలను చంద్రబాబు పక్కన పెట్టారు.
వాస్తవానికి అసెంబ్లీలోకి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల ఎంట్రీ వేరుగా ఉంటాయి. వైఎస్ జగన్‌కి ఈ ఎన్నికలలో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.. నిబంధనల ప్రకారం ఆయన సాధారణ ఎమ్‌ఎల్‌ఏ.. జగన్‌కు ప్రతిపక్ష హోదాకూడా లేకపోవడంతో.. ఆయన కారుతో పాటు మిగతా వైసీపీ ఎమ్మెల్యేల వాహనాలు అసెంబ్లీ బయటే పార్క్ చేసి లోపలోకి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఆయనకు విపక్ష హోదా లేకపోతే ఏంటి..! వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనను కారుతో సహా లోపలోకి అనుమతించేలా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు జగన్ కు ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆయనకు ఇచ్చే గౌరవం ఇవ్వాలని చంద్రబాబు తమ పార్టీ నేతలకు సూచనలు ఇచ్చారు.
మరోవైపు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో జగన్ కు గౌరవం లభించిందని శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల తెలిపారు.. ఇంగ్లీష్ అక్షరాల ఆర్డర్ లో సాధారణ సభ్యుల ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కానీ వైఎస్సార్‌సీపీ నుంచి స్పెషల్ రిక్వెస్ట్ వచ్చిందని.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే చాలా ఉదారంగా వ్యవహరించారన్నారు. ఇలాంటి విషయాల్లో కచ్చితంగా అనుమతి ఇద్దామని ముఖ్యమంత్రి వెంటనే ఆదేశాలు ఇచ్చారని అన్నారు.
వైఎస్ జగన్ కారు వస్తే అసెంబ్లీలోకి అనుమతించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేసారు.. అలాగే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారం చేయించారు. వాస్తవానికి ఎమ్మెల్యేల పేరులోని ఆంగ్లంలో మొదటి అక్షరం ప్రకారం ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఇలా చూస్తే జగన్ పలువురు ఎమ్‌ఎల్‌ఏలు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన చేయాల్సి ఉంటుంది.. ప్రమాణ స్వీకారానికి మంత్రుల తర్వాత అవకాశం ఇవ్వాలని చంద్రబాబుని రిక్వెస్ట్ చేశారు జగన్.. వైసీపీ అధినేత కోరికను చంద్రబాబు మన్నించారు.. జగన్‌కి ముందుగా చాన్స్ ఇవ్వాలని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌ని ఆదేశించారు చంద్రబాబు.. ఇలా, జగన్ గౌరవాన్ని కాపాడారు ముఖ్యమంత్రి.. సోషల్ మీడియాలో ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇది కదా నిజమైన రాజకీయ నాయకులు వ్యవహరించాల్సిన తీరు. ఇది కదా ప్రజాస్వామ్య పాలన అంటే… అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.











