ఐపీఎల్ పై కరోనా తన పంజా విసిరింది. లీగ్ కు ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఈ వైరస్ భారిన పడ్డారు. సెప్టెంబర్ 19 నుంచి మొదలు కానున్న ఈ లీగ్ కోసం అన్నీ జట్లు ఇప్పటికే దుబాయికు చేరుకున్నాయి. ఇండియాలో కరోనా ఉదృతి కారణంగా ఈ సీజన్ ను దుబాయ్ లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ నిబంధనల మేరకు దుబాయ్ కు చేరిన జట్లన్నీ 6 రోజులు తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాలి. ఈ ఆరు రోజులలో ఆటగాళ్లందరికీ మూడు సార్లు పరీక్షలు చేయనున్నట్లు బోర్డు తెలిపింది. మార్గదర్శకాల ప్రకారం అన్నీ జట్ల ఆటగాళ్లకు ఇప్పటికే రెండు పరీక్షలు నిర్వహించారు. ఆరు రోజుల గడువు పూర్తి కావడంతో వారికీ మరోమారు పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షలలో చెన్నై సూపర్ కింగ్స్ కు చెందిన 13 మందికి కరోనా సోకినట్లు తేలింది. వీరిలో ఒకరు బౌలర్ కాగా మిగిలిన 12 మంది సహాయ సిబ్బంది. దీంతో వీరిని వేరే ప్రదేశాలకు తరలించారు. కరోనా విరామం తరువాత ఇంగ్లాండ్ జట్టు ఒక్కటే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచులు ఆడిన సంగతి తెలిసిందే. వారు అనుసరించిన విధానాలనే ఐపీఎల్ అధికారులు అనుసరిస్తున్నారు. ‘బయో బబుల్’ విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం అన్నీ పరీక్షలలో నెగటివ్ వస్తేనే వారిని ‘బయో బబుల్’ లోకి అనుమతి ఇస్తారు. కీలకమైన ఆటగాళ్లు కరోనా భారిన పడకపోవడం ఊరట ఇచ్చినా వైరస్ తీవ్రతతో మునుముందు ఇక్కట్లు తప్పవని క్రీడా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.