ఇద్దరు మహిళా నేతలు. ఇప్పుడు వారిద్దరూ కాగ్రెస్‌ను వీడారు. వారిలో ఒకరు వేరే పార్టీలో చేరారు .. మరొకరు చేరనున్నారు. ఓ జాతీయ పార్టీ నుండి మరో జాతీయ పార్టీలోకి ఎంట్రీ. ఇప్పుడు బీజేపీలో ఇద్దరూ జట్టు కట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సీనియర్ అయిన తనను కాదని కొత్తగా వచ్చిన రాములమ్మను అందలం ఎక్కించారు అయినా ఆమె కిమ్మన లేదు. ప్రచార కమిటీలో రాములమ్మకు ఛైర్ పర్సన్ పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ కో కన్వీనర్‌గా జేజమ్మను పెట్టినా తన పని తాను చేసుకు పోయారు. అయితే, తాజాగా బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు జేజమ్మ. జేజమ్మ బాటలోనే రాములమ్మ బీజేపీలో చేరబోతున్నారు. బీజేపీలోకి రాములమ్మ రాక జేజమ్మకు చెక్ పెట్టేందుకే అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
నాకు నేనే పోటీ.. జేజమ్మ
కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని భావించిన జేజమ్మ డీకే అరుణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేశారు. అయితే సమయం తక్కువగా ఉన్నందున్న ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అంతే కాకుండా డీకే అరుణ పోటీలో ఉందని చెయ్యి గుర్తుకు ఓట్లు పడటంతో ఆ మేరకు ఓట్లు తగ్గాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తరువాత బీజేపీని ప్రజల్లోకి తీసుక వెళ్ళేందుకు కృషి చేస్తూ వస్తున్నారు . జాతీయ కమిటీలో డీకే అరుణకు జాతీయ ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టింది అగ్రనాయకత్వం. దీంతో ఆమె స్పీడ్ పెంచారు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నియోజక వర్గ ప్రజలతో కలుస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. ఇక తాజాగా మరోమారు విజయశాంతి బీజేపీలో చేరడం ఖాయం అయిపోయింది. దీంతో విజయశాంతికి పార్టీ ఎలాంటి పదవి కట్టబెడుతుందో అన్న చర్చ సాగుతోంది. డీకే అరుణను కాదని బీజేపీలో విజయశాంతికి పదవులు కట్టబెడతారా అన్న చర్చలు కూడా సాగుతున్నాయి
తమ మార్క్ చాటుకున్న ఇద్దరూ..
డీకే అరుణ రాజకీయంగా పట్టున్న కుటుంబం నుండి వచ్చారు. విజయశాంతి సినీ గ్లామర్‌తో రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఇద్దరూ రాజకీయల్లోకి అడుగు పెట్టిన వెంటనే తమ మార్క్ చాటుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటారు. అరుణ ఎమ్మెల్యేగా , మంత్రిగా పనిచేయగా.. విజయ శాంతి ఎంపీగా గెలిచి తెలంగాణ గళాన్ని పార్లమెంట్‌లో వినిపించారు. రాష్ట్ర ప్రజల్లో తమ కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే , విజయశాంతి రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా ఉండరని పేరుంది. ఎప్పుడో ఓ సారి సోషల్ మీడియా పోస్ట్‌లు మినహా మీడియా ముందు, ప్రజల ముందుకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇదే డీకే అరుణ మాత్రం మీడియా ముందు ప్రజల మధ్య ఉంటూ తన గ్రాఫ్ పెంచుకుంటున్నారు. ఈ ఇద్దరిలో ఎవరూ ఎవరికి పోటీ కాదంటున్నారు. గ్లామర్‌లో తనతో పోటీ పడతుందేమో కాని రాజకీయాల్లో తనకు ఏ మాత్రం పోటీ కాబోదని అరుణ అంతరంగా సన్నిహితులు చెబుతున్నారు. మరి కాంగ్రెస్ తరహాలోనే విజయశాంతికి అరుణకు పోటీ ఇచ్చే పదవినే కట్టబెడతారా.. లేక ప్రస్తుతం జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్న డీకే అరుణ, విజయశాంతికి అంత ప్రాధాన్యత ఇవ్వనిస్తారా.. రాష్ట్రంలో విజయశాంతి సేవలు వినియోగించుకుంటారా .. లేక ఇతర రాష్ట్రాల బాధ్యతలను అప్పగిస్తారో వేచి చూడాలి.











