కృష్ణా జిల్లా వెదురుపావులూరు టోల్ గేట్ వద్ద శనివారం రాత్రి జరిగిన వాహనాల రద్దీ, తోపులాట ఘటనపై సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా వర్గాల్లో వచ్చిన వార్తలపై అసలు నిజాలు బయటపడ్డాయి. ఈ ఘటనతో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఎలాంటి సంబంధం లేదని తేలిపోయింది. సాంకేతిక సమస్యలు, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల జరిగిన రగడను, ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యేపైకి నెట్టే ప్రయత్నం చేశారని నిజాలు వెలుగులోకి వచ్చాయి.
టోల్ ప్లాజా వద్ద లారీలు బారులు తీరి ట్రాఫిక్ నిలిచిపోవడానికి ప్రధాన కారణం సాంకేతిక లోపమేనని ప్రాథమిక పరిశీలనలో తేలింది. కొందరు టిప్పర్ లారీ డ్రైవర్ల వాహనాల్లో ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) బ్యాలెన్స్ అయిపోవడం, మరికొన్ని వాహనాలకు సమయానికి రీఛార్జ్ ఆలస్యం కావడంతో టోల్ గేట్ స్కానర్లు రీడ్ కాలేదు. దీంతో గేట్లు తెరచుకోక లారీలు వరుసగా నిలిచిపోయి తీవ్ర వాహనాల రద్దీకి దారితీసింది.
వివాదం పెద్దది కావడం, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో భయాందోళనకు గురైన టిప్పర్ లారీ డ్రైవర్లు ఆ సమయానికి తప్పించుకునేందుకు మేము ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మనుషులం అంటూ ఆయన పేరును వాడుకున్నారు. అయితే, ఈ విషయాన్ని సదరు డ్రైవర్లు స్వయంగా అంగీకరిస్తూ బహిరంగంగా క్షమాపణలు కోరారు. పోలీసుల భయం వల్లే తాము అబద్ధం చెప్పామని, ఈ ఘటనతో ఎమ్మెల్యే గారికిగానీ, ఆయన అనుచరులకుగానీ ఎలాంటి సంబంధం లేదని డ్రైవర్లు స్పష్టం చేశారు.
ఈ రగడపై టోల్ ప్లాజా మేనేజర్ గఫార్ స్పందిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. రోజూ అనేకమంది వాహనదారులు, లారీ డ్రైవర్లు టోల్ రుసుము చెల్లించకుండా తప్పించుకోవడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖ నాయకుల పేర్లు చెప్పడం అలవాటుగా మారిందని తెలిపారు. వెదురుపావులూరు ఘటనలో కూడా అదే జరిగిందని, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రమేయం ఇందులో ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు.
తన పేరును దుర్వినియోగం చేస్తూ టోల్ గేట్ వద్ద రగడ సృష్టించిన ఉదంతంపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. చట్ట వ్యతిరేక పనులు చేస్తూ, తప్పులు చేస్తూ తన పేరును అడ్డుపెట్టుకోవాలని చూస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. నిబంధనల ప్రకారం టోల్ రుసుము ప్రతీ ఒక్కరూ చెల్లించాల్సిందేనని, అనవసరంగా తన పేరు వాడుకుని దుష్ప్రచారాలకు దిగితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.











