నవ్యాంధ్ర రాజధాని అమరావతి భవిష్యత్‌పై బిజినెస్ స్టాండర్డ్ అద్భుతమైన కథనం రాసింది. పదేళ్ల క్రితం సాధారణ వ్యవసాయ భూములుగా ఉన్న ఈ ప్రాంతం, ప్రపంచ స్థాయి క్వాంటం క్యాపిటల్‌గా ఎలా రూపాంతరం చెందబోతుందో ఆ వ్యాసంలో స్పష్టంగా వివరించింది. 1990లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన సీఎం చంద్రబాబు నాయుడు, అమరావతిని నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్‌గా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను సైతం ఈ ఆర్టికల్‌లో వివరించింది.
2014 రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అవసరమైన సమయంలో..కృష్ణా నది ఒడ్డున గ్రీన్‌ఫీల్డ్ రాజధానిగా అమరావతి పేరుతో రాజధాని నిర్మాణం మొదలైందని తెలిపింది. స్థానిక రైతులు స్వచ్ఛందంగా 34,000 ఎకరాలకు పైగా భూమిని పూలింగ్ ద్వారా ఇచ్చి రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యారని తెలిపింది. అమరావతి కేవలం పరిపాలనా నగరంగా మాత్రమే కాకుండా సుస్థిరమైన, నాలెడ్జ్ ఆధారిత రాజధానిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిందని పేర్కొంది.
1990ల్లో హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో చంద్రబాబు నిలిపారని గుర్తు చేసింది. ఆ టైంలో ఆయనను CEO సీఎంగా పిలుచుకునే వారని..అదే అనుభవంతో, ఇప్పుడు అమరావతిని క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీ రంగాలు సమ్మిళితమయ్యే క్వాంటం వ్యాలీగా మార్చుతున్నారని కొనియాడింది. అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఇక్కడ కొలువుదీరడంతో ఆసియాలోనే అత్యంత కీలకమైన నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా అమరావతి గుర్తింపు పొందిందని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, నూతన పారిశ్రామికవేత్తలు ఈ నగర ప్రగతిలో భాగస్వాములవుతున్నారని వివరించింది.
35 సంవత్సరాల తర్వాత అమరావతి ఎలా ఉండబోతుందనే విషయాన్ని కూడా అంచనా వేసింది. 2061 నాటికి అమరావతిలో 350కి పైగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, 500కి పైగా డీప్-టెక్ స్టార్టప్‌లు కొలువుదీరుతాయని తెలిపింది. దాదాపు 12.5 లక్షల నూతన ఉద్యోగాలు రాబోతున్నాయని స్పష్టం చేసింది. ఈ ప్రాంత ఆర్థిక విలువ $220 బిలియన్లకు చేరుకుంటుందని తెలిపింది. 10కిపైగా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు, రీసెర్చి ఇనిస్టిట్యూషన్స్ వస్తాయని చెప్పింది. దాంతో పాటు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ పెరగబోతుందని ఎయిర్‌పోర్టు, ఇంటిగ్రేటెడ్ మెట్రో, హై స్పీడ్ రైలు అందుబాటులోకి వస్తుందని తెలిపింది. అంతేకాకుండా, ప్రభుత్వ భవనాలకు 100% గ్రీన్ ఎనర్జీని ఉపయోగిస్తూ పర్యావరణ పరిరక్షణతో కూడిన ఆధునిక ప్రగతికి అమరావతి ప్రతీకగా నిలవబోతుందని పేర్కొంది.











