ఏపీలో గ్రామీణాభివృద్ధి టార్గెట్‌గా కూటమి ప్రభుత్వం పల్లె పండగ 3.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం రామాపురంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ అభివృద్ధి పనులను లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. రూ.11,085 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పల్లెల రూపురేఖలు మారనున్నాయి.
ఈ విడతలో ప్రధానంగా రూ.10,250 కోట్లతో వేల కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా రూ.2,700 కోట్లతో 6 వేల కి.మీ. సిమెంట్ రోడ్లు, రూ.7,550 కోట్లతో 9,500 కి.మీ. BT రోడ్లు వేయనున్నారు. అలాగే పాడి రైతుల సంక్షేమం కోసం రూ.300 కోట్లతో 22 వేల మినీ గోకులాల నిర్మాణం, ఉద్యానవన ప్రోత్సాహానికి రూ.225 కోట్లతో 50 వేల ఎకరాల్లో తోటల పెంపకం చేపట్టనున్నారు. వీటితో పాటు మ్యాజిక్ డ్రెయిన్లు, బస్సు షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు రూ.310 కోట్లు కేటాయించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను సమర్థంగా ముందుకు నడిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అటకెక్కిన ఉపాధి హామీ పథకానికి పూర్వవైభవం తెచ్చి, ఏపీని మళ్లీ అగ్రస్థానంలో నిలిపింది. కేంద్రం నుంచి వచ్చే పంచాయతీ నిధులను విద్యుత్ బకాయిల పేరుతో దారి మళ్లించే విధానానికి స్వస్తి పలికి, నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాలకే చేరవేస్తోంది. సర్పంచ్‌లకు పూర్తి ఆర్థిక స్వేచ్ఛను కల్పించింది.
పారదర్శకత కోసం స్వర్ణ పంచాయతీ పోర్టల్‌ను తీసుకొచ్చి ఆన్‌లైన్ పన్నుల చెల్లింపు విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫలితంగా పన్నుల వసూళ్లు గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలోని 13,218 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభలు నిర్వహించి ప్రభుత్వం ప్రపంచ రికార్డు సృష్టించింది. శాఖాపరమైన పాలనలోనూ కీలక సంస్కరణలు తెచ్చి, అన్ని కార్యాలయాలను ఒకే ప్రాంగణానికి మార్చడంతో పాటు ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేసింది. పక్కా ప్లాన్‌తో గ్రామాలను కేరళ మోడల్‌లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం దూసుకెళ్తోంది.











