ICC మహిళా T20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బౌలర్ శ్రీ చరణి సంచలన రికార్డు నెలకొల్పారు. ఇంటర్నేషనల్ T20 క్రికెట్ హిస్టరీలోనే హయ్యెస్ట్ రేటింగ్ సాధించిన బౌలర్‌గా నిలుస్తూ ఏకంగా 817 రేటింగ్ పాయింట్లతో నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. శ్రీచరణి సాధించిన ఈ అరుదైన మైలురాయిపై ICC…A new high అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా అభినందించింది.
ప్రపంచ రికార్డుతో దేశ కీర్తిని పెంచిన శ్రీచరణిపై మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. శ్రీచరణితో తనకున్న మొదటి పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగమైన విషయాన్ని పంచుకున్నారు. 2025 ప్రపంచకప్ టైంలో టీమిండియా జట్టుతో పాటు శ్రీచరణిని నేను తొలిసారి కలిశాను. అప్పట్లో ఆమె సిగ్గుపడుతూ కనిపించినప్పటికీ..క్రికెట్ ఆడాలనే తన కలను నెరవేర్చుకోవడం కోసం అన్ని అడ్డంకులను ఎదుర్కొని, తన తండ్రిని ఎలా ఒప్పించిందో నాకు చెప్పింది అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
కడప జిల్లాలోని యరమలపల్లి అనే గ్రామం నుంచి వచ్చి, అవకాశం కోసం పోరాడే స్థాయి నుంచి..ఇవాళ ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన మహిళా బౌలర్‌గా ఎదగడం శ్రీచరణి కృషికి నిదర్శనం. కష్టపడే తత్వంతో పాటు కన్న కలలను నెరవేర్చుకోవాలనే తపన ఉంటే ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా అధిగమించవచ్చని శ్రీచరణి నిరూపించింది.
ఆట కోసం పోరాడే స్థాయి నుంచి క్రికెట్ చరిత్రను తిరగరాసే స్థాయికి ఎదిగావు..నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది శ్రీచరణి! ఇలాగే విజయాల శిఖరాలను అధిరోహించు అంటూ లోకేష్ ఆమెను మనస్ఫూర్తిగా ప్రోత్సహించారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన శ్రీచరణి ప్రయాణం తెలుగు రాష్ట్రాల యువతకు, క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.











