మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ఊహించని విధంగా వరుసగా సినిమాలు చూస్తూ దూసుకెళుతున్నారు. రీ ఎంట్రీలో ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తారనుకుంటే… ఒక సినిమా సెట్స్ పై ఉండగానే రెండు మూడు సినిమాలు అనౌన్స్ చేస్తూ.. దూసుకెళుతున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్న భారీ చిత్రం ఆచార్య ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.
అయితే.. ఆచార్య రిలీజ్ కాకుండానే గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాల్ని పట్టాలెక్కించారు. బాబీతో చేయనున్న మూవీని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లో బాబీ దర్శకత్వంలోని సినిమాని కూడా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతోందని వార్తలొస్తున్నాయి. ఇవి కాకుండా మెగాస్టార్ ఇప్పుడు ఓ యంగ్ డైరెక్టర్ కు కూడా ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు వెంకీ కుడుముల. నాగశౌర్యతో ఛలో, నితిన్ తో భీష్మ చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకున్న వెంకీ కుడుముల.. మహేష్ తో సినిమా చేయాలనుకున్నారు కానీ.. సెట్ కాలేదు.
ఆ తర్వాత ఆచార్య షూటింగ్ టైమ్ లో చిరంజీవికి ఓ స్టోరీ లైన్ చెప్పి బాగా ఇంప్రెస్ చేశారట వెంకీ కుడుముల. ఈ మధ్యనే ఫుల్ స్టోరీ నెరేట్ చేసి చిరు నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకున్నట్టు తెలుస్తోంది. ఫైనల్ డ్రాఫ్ట్ ను రెడీ చేసుకోమని, త్వరలోనే సినిమాను లాంచ్ చేద్దామని చెప్పారట చిరంజీవి. ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య నిర్మించనున్నట్లు సమాచారం. అయితే.. వరుసగా సినిమాలు చేస్తూ మెగాస్టార్ ఫుల్ బిజీగా ఉండడంతో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లాలంటే కొంతకాలం ఆగాల్సిందే. మొత్తానికి చిరంజీవి స్పీడు మామూలుగా లేదుగా..











